భిక్షాటన చేసే పిల్లల్ని తరుచుగా రోడ్లపై చూస్తుంటాం. అయ్యో పాపం అనుకుంటాం తప్ప.. ఎందుకలా అయ్యారన్న కారణం మాత్రం ఆలోచించం. దిల్లీకి చెందిన ఆశిష్ అందరిలా ఆలోచించలేదు. బాలల భిక్షాటన లేని భారత దేశాన్ని చూడాలనుకున్నాడు. వినూత్న నిర్ణయంతో సమస్య పరిష్కారానికి బాటలు వేశాడు.
ఆ సంఘటనతో ఓ సంకల్పానికి దారి:
ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉద్యోగం చేస్తున్న సమయంలో భిక్షాటన చేస్తూ చేతి నుంచి రక్తమోడుతున్న పిల్లాడ్ని చూశాడో రోజు. వైద్యం చేయించి, ఓ స్వచ్ఛంద సంస్థ సహాయంతో పాఠశాలలో చేర్పించాడు. ఆ బాలుడి భవిష్యత్కో భరోసా దొరికినా...దేశంలో ఇంకెంతమంది ఇలా దుర్భర జీవనాన్ని సాగిస్తున్నారో అనే ఆలోచన వెంటాడింది.
ఉన్ముక్త్ ఇండియా:
2015లో ఉద్యోగానికి రాజీనామా చేసి..బాలల విద్యా ప్రాముఖ్యత తెలియజేసేందుకు "ఉన్ముక్త్ ఇండియా" పేరుతో 17 వేల కిలోమీటర్ల పాదయాత్రకు సంకల్పించాడు. దువాయే పేరుతో స్వచ్ఛంద సంస్థనూ స్థాపించాడు.
22 ఆగస్టు 2017న జమ్ముకశ్మీర్ నుంచి పాదయాత్ర మొదలుపెట్టాడు. ఇప్పటికి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా 217 నగరాల్లో పర్యటించాడు.
ఒక జిల్లాకు చేరుకోగానే..కలెక్టర్, ఎస్పీ, వివిధ పాఠశాలల యాజమాన్యాలతో సమావేశమవుతాడు. బాలల విద్యా ప్రాముఖ్యత గురించి వివరించి..పిల్లల్ని భిక్షాటనకు దూరంగా ఉంచాలని విజ్ఞప్తి చేస్తాడు.
డబ్బిలిచ్చే బదులు విద్యనివ్వాలి:
పేదరికం ఒక్కటే కారణం కాదని.. బాలల భిక్షాటన వెనక మాఫియా ఉందనే అనుమానం వ్యక్తం చేస్తున్నాడు ఆశిష్. .యాచించేవారికి డబ్బులిచ్చే బదులు చదివించే ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాడు.
2019 మార్చికి ఆశిష్ పాదయాత్ర పూర్తవుతుంది. దేశంలోని విద్యా సంస్థలన్నింటిని అనుసంధానిచేందుకు దువాయే పేరుతో మొబైల్ అప్లికేషన్ ప్రారంభించాడు. 14 జూన్ 2019న నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ యాప్ విడుదల కానుంది.
ఇదీ చూడండి: గుర్రాలతోనే జీవితస్వారీ...