రానున్న హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో మంత్రి కేటీర్‌ను తెరాస అభ్యర్థిగా ప్రకటించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సవాల్ విసిరారు. కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేసేందుకు ఈ ఉప ఎన్నికలు వచ్చాయని దుయ్యబట్టారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఏర్పాటు చేసిన భాజపా నాయకులు, కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుందని అర్వింద్ విమర్శించారు. దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత తెరాస ప్రభుత్వానికి పతనం ప్రారంభమైందన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల తర్వాత తెరాస పేకమేడలా కూలిపోతుందని ఎద్దేవా చేశారు. కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చేసేందుకు ఈటల అడ్డుపడుతున్నాడని.. ఆ అక్కసుతోనే ఈటలను పక్కకుపెట్టారని ఆరోపించారు. కేటీఆర్ రాజకీయ భవిష్యత్తు కోసమే ఈటలకు అన్యాయం చేశారన్నారు. ఎన్ని చేసినా కేటీఆర్ ముఖ్యమంత్రి కావటం కలగానే మిగులుతుందని అన్నారు.
హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బుద్ధిచెప్పేందుకు ప్రజలు సిద్ధమయ్యారని అర్వింద్ పేర్కొన్నారు. సొంత పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులను కొనుగోలు చేసే దుస్థితి తెరాసకు పట్టిందన్నారు. ఉప ఎన్నికల్లో ఈటల భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: కేసీఆర్ సార్.! మా సమస్యలు వినండి.. ప్రగతి భవన్ ఎదుట యువతి హల్చల్