తెలంగాణలో దళితబంధు సాధ్యం కాదని ఆర్థిక శాఖకు చెందిన ఓ సీనియర్మోస్ట్ అధికారి తనతో చెప్పినట్లు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ (Mp Arvind Comments) చెప్పారు. ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక స్థితికి దళితబంధు అమలు చేయడం అస్సలు సాధ్యపడదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులను ప్రతిసారి మోసం చేస్తున్నారని అర్వింద్ ఆరోపించారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని వాగ్దానం చేసి మాట మార్చారని దుయ్యబట్టారు.
హుజూరాబాద్ ఉపఎన్నికపై తండ్రీకొడుకులు తలో మాట మాట్లాడుతున్నారని మండిపడ్డారు. దళితబంధు ఆపినట్లు నకిలీ లెటర్లు సృష్టించారన్నారు. ఈటల, ప్రేమేందర్ రెడ్డి పేర్ల మీద లెటర్లు సృషిస్తున్నారని ఆరోపించారు. దళితుడిని రాష్ట్రపతిని చేసిన పార్టీ భాజపా అని ఉద్ఘాటించారు. దళితులను మోసం ఇవాళ తెరాస అధికారంలో ఉందని అర్వింద్ ఎద్దేవా చేశారు. ఈటల గెలిస్తే ఏం వస్తుందని తెరాస నేతలు ప్రచారం చేస్తున్నారన్న ఆయన... ఈటల గెలిస్తే కేసీఆర్‌కు బుద్ధి వస్తుందన్నారు. దళితబంధును రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు వివరించారు.
కేటీఆర్ అసమర్థ మంత్రి కాబట్టి... ఈటలను మంత్రివర్గం నుంచి తప్పించారని మండిపడ్డారు. జీహెచ్ఎంసీలో పదివేలు ఇవ్వని వాళ్లు... హుజూరాబాద్‌లో 10 లక్షలు ఇస్తారా అని ప్రశ్నించారు. కేసీఆర్, రేవంత్‌రెడ్డి వీరిద్దరిలో ఎవరో పెద్ద మోసగాడో మేధావులు కూడా చెప్పలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. నోటిఫికేషన్ల గురించి అడిగిన యువతిని చితకబాదారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో కూడా తనపై పోటీకి కవితను నిలబెట్టాలని కేటీఆర్‌కు సవాల్ విసిరారు.
నువ్వు ముఖ్యమంత్రి అయినవ్. ఫస్ట్ ఒక దళితుడిని డిప్యూటీ సీఎంను చేసినవ్. సరే ఆయన మీద ఏదో ఆరోపణలు వచ్చినయని తీసేసినవ్. తర్వాత కడియం శ్రీహరిని డిప్యూటీ సీఎంను చేసినవ్. తర్వాత ఆయన కనీసం టికెట్ ఇచ్చిండా? 2018లో మళ్ల ముఖ్యమంత్రి అయినంక... ఊకే దళితులను ఉపముఖ్యమంత్రి పెడితే... నేను దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తనన్న మాట గుర్తొస్తదని ఆయింత అది కూడా తీసేసిండు. కేసీఆర్ ఎన్ని ప్రామిసులు చేసిండు దళితులకు. మూడెకరాల భూమి ఇస్తనన్నడు అది వాస్తవం కాదా? తర్వాత ఆయన మాట మార్చి దళితులకు మూడెకరాలు ఇస్తా అనలేదు. మూడెకరాలు ఉండాలే అని అన్నడంట. దళితులకు డబుల్ బెడ్రూం ఉండాలే... కట్టిస్తా అనలేదంట. దళితబంధు కూడా అమలు కాదని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సీనియర్ మోస్ట్ ఆఫీసర్ స్వయంగా చెప్పిండు. దళితబంధు ఇంపాజిబుల్ అని.
-- ధర్మపురి అర్వింద్, ఎంపీ
ఇదీ చదవండి: Asaduddin owaisi cricket: భారత్ - పాక్ క్రికెట్ మ్యాచ్‌పై అసదుద్దీన్ కీలక వ్యాఖ్యలు