హైదరాబాద్‌ను అతలాకుతలం చేసిన వరదలకు మానవతప్పిదాలే ప్రధాన కారణమని నీతి ఆయోగ్ తేల్చింది. అడ్డగోలుగా జలవనరులను ఆక్రమించడంతో... భారీ వరదలు మహానగరాన్ని ముంచెత్తాయని నివేదికలో పేర్కొంది. గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒకప్పుడు చెరువులు, కుంటలు, బావుల వంటి చిన్నా, పెద్ద నీటివనరులు దాదాపు లక్ష వరకు ఉండేవని.. వాటి సంఖ్య ఇప్పుడు 185కి తగ్గిపోయిందని తెలిపింది. వాటిలోనూ సగానికి సగం చెరువుల ప్రవాహ మార్గాలన్నీ మూసుకుపోయాయని పేర్కొంది. నగరంలోని చెరువులు పొంగి పొర్లడం వల్లే అత్యధిక నష్టం జరిగిందని... హుస్సేన్‌సాగర్ నాలాల ఆక్రమణల వల్ల వరద నీరు కాల్వల బయట ప్రవహించిందని తెలిపింది. దానివల్లే వరద ప్రభావం తీవ్రత పెరిగి ఎక్కువ ప్రాంతం నీట మునిగిందని పేర్కొంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్‌కుమార్ నేతృత్వంలోని 16 మంది సభ్యులతో కూడిన కమిటీ వరదల నివారణపై ఓ నివేదికను రూపొందించింది. దేశం లోపల, సరిహద్దుల్లోనూ వరదల నియంత్రణ, నదీ యాజమాన్య కార్యకలాపాలపై ఈ అత్యున్నత నిపుణుల బృందం అధ్యయనం చేసి.. రూపొందించిన నివేదికలో హైదరాబాద్ వరదలకు కారణాలు, భవిష్యత్‌లో అలాంటి పరిస్థితులు తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను స్పృశించింది. గత ఏడాది అక్టోబరు హైదరాబాద్‌లో వచ్చిన వరదల వల్ల జరిన నష్టంపై ప్రభుత్వం అందించిన నివేదిక నీతిఆయోగ్ ఉటంకించింది.
సరైన ప్రణాళికే లేదు
భారీ వరదలతో 33 మంది చెందగా, కనీసం 37 వేల 409 కుటుంబాలు వీటివల్ల ప్రభావితమైనట్లు గ్రేటర్ హైదరాబాద్ మహానగర పాలకసంస్థ అంచనా వేసింది. నగరానికి 670 కోట్ల నష్టం వాటిల్లినట్లు పురపాలక శాఖ మంత్రి చెప్పినట్లు నీతి ఆయోగ్ వెల్లడించింది. ఐతే.. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ వద్ద కానీ, తెలంగాణ ప్రభుత్వం వద్ద కానీ ప్రకృతి వైపరీత్యాల నిర్వహణకు సరైన ప్రణాళికే లేదని నీతి ఆయోగ్ ఆక్షేపించింది. భవిష్యత్‌లో ఇలాంటి విపత్తులను నివారించాలంటే జంటనగరాల్లోని డ్రైనేజీ వ్యవస్థ విస్తరణ, పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని సిఫారసు చేసింది. నగరంలో ఎక్కడ వర్షం కురిసినా భూగర్భ డ్రైనేజీ ద్వారా మూసీ నదికి చేరేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది.
డ్రైనేజీ వ్యవస్థ విస్తరించాలి
వరదల నివారణకు నీతి ఆయోగ్ కొన్ని సూచనలు చేసింది. నగరంలో అత్యవసరంగా డ్రైనేజీ వ్యవస్థను విస్తరించాలని... హైడ్రో జియాలజీని పరిగణనలోకి తీసుకుని నిర్మాణాలకు అనుమతిస్తే వరద ముంపును నివారించడానికి వీలవుతుందని పేర్కొంది. వరదల సమయంలో పోటెత్తే నీటిని మళ్లించేందుకు వీలుగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న 185 చెరువులను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానం చేయాలని సూచించింది. నాలాలను పునరుద్ధరించి, ఆక్రమణలను తొలగించాలని తెలిపింది.
ఇదీ చూడండి : విద్యుద్దీపాల వెలుగులో రాజన్న ఆలయం