Niranjan Reddy on Agriculture Sector: దేశవ్యాప్తంగా వ్యవసాయం తిరోగమనం అని.. తెలంగాణలో మాత్రం పురోగమనంలో ఉందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. వ్యవసాయం, రైతుల విషయంలో కేంద్రం అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. వ్యవసాయంపై మక్కువతోనే కేసీఆర్.. రైతుల కోసం ఎన్నో కార్యక్రమాలు తెచ్చారని గుర్తు చేశారు. అన్నదాతల జీవితాలు మార్చడానికి ప్రయత్నిస్తున్న నేత కేసీఆర్.. అని వివరించారు.
అసెంబ్లీలో వ్యవసాయ రంగానికి కేటాయింపులపై ఇవాళ జరిగిన చర్చకు ఆయన సమాధానమిచ్చారు. చర్చను ప్రారంభించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు.. రైతు రుణమాఫీ విషయంలో స్పష్టత లేదని విమర్శించారు. అలాగే పత్తి కోసం కేంద్రం తక్కువ నిధులు కేటాయించిన తరుణంలో కొనుగోళ్లకు రాష్ట్ర ప్రభుత్వంపై భారం ఎక్కువ పడుతోందని తెలిపారు. అయితే బడ్జెట్‌లో వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.68,500 కోట్ల కేటాయించామని నిరంజన్ రెడ్డి తెలిపారు. వ్యవసాయ విద్యుత్ వినియోగంలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ అని చెప్పారు. ప్రతి వంద యూనిట్లలో 37 శాతం.. వ్యవసాయానికే వినియోగమని పేర్కొన్నారు. రైతు బీమా తరహా పథకం ప్రపంచంలో ఎక్కడా లేదని స్పష్టం చేశారు. రుణమాఫీ విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వివరించారు.
కనీస మద్దతు ధర విషయంలో రైతులను కేంద్రం మోసం చేస్తోంది: రైతులకు ఇచ్చిన ఏ హామీని కేంద్రం అమలు చేయలేదని నిరంజన్ రెడ్డి ఆరోపించారు. కనీస మద్దతు ధర విషయంలో రైతులను కేంద్రం మోసం చేస్తోందని విమర్శించారు. పత్తి కొనుగోళ్లకు కేంద్రం రూ.లక్ష మాత్రమే పెట్టి.. రైతులను అవమానించిందని తెలిపారు. దీనిపై పత్తి రైతులు బాధపడాల్సిన అవసరం లేదని వివరించారు. కోతుల బెడదపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని చెప్పారు. కొహెడలో ఆసియాలోనే అతి పెద్ద ఫ్రూట్ మార్కెట్ వస్తుందని.. సీఎం ఆమోదంతో త్వరలోనే పనులు ప్రారంభిస్తామని నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు.
"వ్యవసాయ విద్యుత్ వినియోగంలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్. ప్రతి వంద యూనిట్లలో 37 శాతం వ్యవసాయానికే వినియోగం. రైతు బీమా తరహా పథకం ప్రపంచంలో ఎక్కడా లేదు. రుణమాఫీ విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రైతులకు ఇచ్చిన ఏ హామీని కేంద్రం అమలు చేయలేదు.కనీస మద్దతు ధర విషయంలో రైతులను కేంద్రం మోసం చేస్తోంది." - సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి
ఇవీ చదవండి: పేదలు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యం: హరీశ్‌రావు