నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్)పై కరోనా పంజా విసిరింది. తాజాగా శుక్రవారం ముగ్గురు ప్రొఫెసర్లు, నలుగురు సిబ్బంది మహమ్మారి బారిన పడ్డారు. నాలుగు రోజుల వ్యవధిలో ఇప్పటి వరకు మొత్తం నలుగురు ప్రొఫెసర్లు, 8 మంది రెసిడెంట్ వైద్యులు 8 మంది పారామెడికల్ సిబ్బందికి వైరస్ సోకినట్లు ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నిమ్మ సత్యనారాయణ తెలిపారు.
కరోనా వ్యాప్తి దృష్ట్యా వీరితో ప్రత్యక్ష సంబంధాలు ఉన్న ఇతర వైద్యులు, స్టాఫ్‌ను క్వారంటైన్‌కు పంపామన్నారు. తొలుత స్పెషాలిటీ బ్లాక్‌లోని కార్డియాలజీ విభాగంలో కరోనా కలకలం రేగింది. ఇందులో నాలుగు యూనిట్లలో 16 మంది వైద్యులు, ఇతర సిబ్బందితో కలిపి 40 మంది వరకు విధులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఎక్కువ మంది కరోనా బారిన పడ్డారు. ఇప్పటికే కార్డియాలజీ విభాగాన్ని పూర్తిగా మూసి వేశారు. తాజాగా ఇదే బ్లాకులోని యూరాలజీ విభాగానికి సోకింది. ఇక్కడ ముగ్గురు ప్రొఫెసర్లు ఇతర సిబ్బందికి పాజిటివ్ వచ్చింది.
ఇలా ఒక్కో విభాగంలో వైద్యులకు కరోనా సోకగా అధికారులు అప్రమత్తమయ్యారు. మొత్తం స్పెషాలిటీ బ్లాక్‌నే కొన్ని రోజులపాటు మూసివేయాలని భావిస్తున్నారు. రోగులను తరలించడమో, ఇంటికి పంపడమో చేయనున్నారు. త్వరలో దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని డా.సత్యనారాయణ తెలిపారు. ఒక్క స్పెషాలిటీ బ్లాక్‌కే కాకుండా శుక్రవారం ఆర్థోపెడిక్ విభాగంలో ఓ రోగికి పాజిటివ్ వచ్చింది. శస్త్ర చికిత్స చేయాలని సిద్ధమవుతుండగా...అతనికి వైరస్ ఉన్నట్లు రిపోర్టులో తేలడం వల్ల వెంటనే గాంధీకి తరలించారు.
వైద్య సిబ్బంది ఆందోళన
వైద్యులతోపాటు కరోనా సోకిన సిబ్బందికి గాంధీ, ఇతర ఆసుపత్రుల్లో కాకుండా నిమ్స్‌లోనే చికిత్స అందించాలని పలువురు పారా మెడికల్ స్టాఫ్ శుక్రవారం నిరసనలు చేపట్టారు. ఆసుపత్రి ఆవరణలో బైఠాయించారు. యాజమాన్యం తమపై వివక్ష చూపుతోందని ప్లకార్డులు చేత పట్టి నినాదాలు చేశారు. నాణ్యమైన రక్షణ పరికరాలు ఇవ్వకపోయినా.. ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్నామన్నారు. ప్రస్తుతం మిలీనియం బ్లాక్‌లో కరోనా సోకిన వారికి చికిత్స అందిస్తున్నారని...రాకపోకలు సాగించే క్రమంలో రోగులకు వచ్చే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.