NIMS Hospital Expansion In Hyderabad : పేదలకు ఉచితంగా మెరుగైన వైద్యం అందించటమే లక్ష్యంగా ముందుకు సాగుతోన్న తెలంగాణ సర్కారు నిమ్స్ ఆసుపత్రి అభివృద్ధికి మరింత పెద్దపీట వేసింది. ఇప్పటికే దాదాపు 30కి పైగా విభాగాలతో కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తున్న నిమ్స్ అదనంగా మరో 2 వేల పడకల నూతన బ్లాక్ నిర్మాణం చేపడుతోంది. దీనికి బుధవారం ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుంది.
NIMS New Block Foundation in Hyderabad : ప్రస్తుతం నిమ్స్ ఆసుపత్రిలో 1800 సూపర్ స్పెషాలిటీ పడకలు అందుబాటులో ఉండగా.. నిత్యం ఆసుపత్రి రోగులతో కిక్కిరుస్తున్న పరిస్థితి. దీనికి తోడు అన్ని రకాల వైద్య సేవలు అందుతున్న నిమ్స్‌లో మాతాశిశు వైద్యం అందుబాటులో ఉంటే మంచిదని భావించిన సర్కారు.. ఇటీవలే నిమ్స్ ప్రాంగణంలో 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్ బ్లాక్‌కి సైతం శంకుస్థాపన చేసింది. ఇక దశాబ్ది ఉత్సవాల వేళ రూ.1.571 కోట్లతో 32 ఎకరాల విస్తీర్ణంలో నూతన బ్లాక్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. దశాబ్ది పేరుతో రూపుదిద్దుకోనున్న ఈ బ్లాక్ నిర్మాణానికి ఈ నెల 14న ముఖ్యమంత్రి కేసీఆర్ భూమిపూజ చేయనున్న నేపథ్యంలో కార్యక్రమ ఏర్పాట్లను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు.
NIMS New Building Foundation in Hyderabad : దశాబ్ది పేరుతో రూపుదిద్దుకోనున్న ఈ నూతన బ్లాక్ నిర్మాణ బాధ్యతలను ఇప్పటికే సర్కారు ఆర్అండ్బీ శాఖకు అప్పగించింది. మొత్తం 32 ఎకరాల 16 గుంటల స్థలంలో రూపుదిద్దుకోనున్న నూతన భవన సముదాయంలో మొత్తం 4 బ్లాక్‌లను అందుబాటులోకి తేనున్నారు. అందులో ఓపీ సేవల కోసం ఒక బ్లాక్, ఐపీ సేవల కోసం రెండు బ్లాక్‌లు, ఎమర్జెన్సీ సేవల కోసం మరో బ్లాక్ అందుబాటులో ఉంచనున్నారు. ఓపీ, ఎమర్జెన్సీ బ్లాక్‌లలో లోవర్ గ్రౌండ్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్లతో పాటు ఒక్కో బ్లాక్‌లో మరో 8 ప్లోర్లు నిర్మించనున్నారు.
ఇక ఐపీ బ్లాక్‌లలో గ్రౌండ్ ఫ్లోర్ కలిపి ఒక్కో దానిలో 15 ఫ్లోర్లు రూపుదిద్దుకోనున్నాయి. 120 ఓపీ గదులు, సహా 1200 ఆక్సిజన్ బెడ్లు, 500 ఐసీయూ పడకలు నూతన బ్లాక్ ద్వారా ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. మొత్తం 38 విభాగాలకు సంబంధించిన సేవలను ఇక్కడ అందించనుండగా.. అందుకోసం 32 మాడ్యూలార్ ఆపరేషన్ థియేటర్లు, 6 మేజర్ మాడ్యూలార్ థియేటర్లు సిద్ధం చేయనున్నారు. నూతన భవన సముదాయంలో అందుబాటులోకి వచ్చే పడకలతో కలిపి నిమ్స్‌లో బెడ్స్ సంఖ్య 4000కి చేరనున్నాయి. ఫలితంగా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందుతాయని సర్కారు భావిస్తోంది. అయితే బుధవారం (ఈ నెల 14న) జరగనున్న భూమి పూజ కార్యక్రమానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు.
ఇవీ చదవండి: