పగలంతా ఎంత శ్రమించినా..సేద తీరేందుకు దొరికే సమయం రాత్రి వేళలోనే. కానీ ఎప్పుడూ హడావుడిగా కనిపించే నగరంలో.. చీకటి వెలుగులనే బేధం లేకుండా జీవన పోరాటం కొనసాగుతుంది. 80లక్షల జనాభా.. అరకోటి వాహనాలతో కిక్కిరిసిపోయే రహదారులతో సందడిగా కనిపించే హైదరాబాద్ రాత్రి వేళ ఎలా ఉంటుంది.. కాలంతో పోటీపడి ఉద్యోగం.. సంపాదన అంటూ లెక్కలుగట్టే జీవితాలు అసలైన ఆనందాన్ని ఆస్వాదిస్తున్నాయా! నగరం నిద్రపోతున్న వేళ అసలేం జరుగుతోందో తెలుసా.. పగలంతా రద్దీగా ఉండే మార్గాలు రాత్రి ఎంతోమందికి జీవనాధారం చూపుతున్నాయి. కుటుంబాన్ని పోషించేందుకు అదే చీకటి ఆసరా ఇస్తోంది. చాలామంది ఆదమరచి నిద్రపోతున్న వేళ రాజధాని ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు బేగంపేట, సికింద్రాబాద్, ట్యాంక్‌బండ్, అబిడ్స్, అఫ్జల్‌గంజ్, చాదర్‌ఘాట్, చార్మినార్, మెహిదీపట్నం, రాయదుర్గం, గచ్చిబౌలి, హైటెక్‌సిటీ, మాదాపూర్, కొండాపూర్, మియాపూర్, కూకట్‌పల్లి..తదితర ప్రాంతాల్లో ‘ఈనాడు’ చేసిన పరిశీలనలో నగర అందాలు.. భావోద్వేగ బంధాలు.. స్పందించే హృదయాలు ఇలా ఎన్నో కనిపించాయి. వాటన్నింటి సమాహారం మీకోసం....
ట్యాంక్‌బండ్‌పై బఠానీలు అమ్ముకునే యాదగిరి. పాతికేళ్లుగా అదే జీవితం. పగలంతా కూలీనాలీ చేసుకుంటాడు. రాత్రి 9 గంటలు కాగానే.. బండిపై కిరోసిన్ దీపం.. బఠానీలు, శనగలతో బయటకు వస్తాడు. ట్యాంక్‌బండ్ వద్దకు చేరతాడు. అర్ధరాత్రి దాటేంత వరకూ అక్కడే ఉంటాడు. అందరికీ చీకటిలో విశ్రాంతి దొరికితే.. తనకు మాత్రం అదే రాత్రి...బతికేందుకు ఆధారమైందంటాడు.
పర్యటకులతో .. దుకాణదారులతో సందడిగా కనిపించే చార్మినార్.. రాత్రి 11-12 గంటల మధ్య ఎలా ఉంటుందో ఊహించగలరా! స్నేహితులతో వీధుల్లో చక్కర్లు కొడుతూ అక్కడికి కుర్రకారు చేరతారు. జీవిత భాగస్వామితో బైక్‌పె వచ్చే వారూ కనిపిస్తారు. సతీమణికి నచ్చిన గాజులు కొనిస్తూ.. ఉస్మానియా బిస్కెట్ తింటూ.. చాయ్ లాగిస్తే ఆ కిక్కే వేరంటారు. పుట్టిన రోజు..పెళ్లి రోజు జరుపుకొనేందుకు ఇంతకు మించిన అందమైన ప్రదేశం ఎక్కడ లేదనే జంటలూ ఉన్నాయి.
చీకటమ్మ.. బతుకు కొమ్మ
పొట్ట చేతబట్టుకుని వచ్చిన వలస జీవులు.. చదువుకోసం చేరిన విద్యార్థులు.. కూలీ దొరుతుందనే ఆశతో ఎదురుచూసే శ్రామికులు.. ఇలా ప్రతి ఒక్కరినీ అక్కున చేర్చుకునేది మహా నగరం. వీరిలో ఎంతోమందికి ఉపాధి చూపేది మాత్రం చీకటమ్మ. మియాపూర్ నుంచి ఎల్‌బీనగర్, ఉప్పల్ నుంచి మాదాపూర్ వరకూ దారి పొడవునా తోపుడు బండ్లు, బడ్డీ దుకాణాలు, ఆటోలు, చిన్నపాటి వాహనాలపై ఆహార పదార్థాలు, తినుబండారాలు విక్రయిస్తుంటారు. ఉదయం నుంచి రాత్రి వరకూ శ్రమించిన బ్రహ్మచారులు, వంటచేసుకునే ఓపికలేని ఆలుమగలకు రాత్రి వేళ అవే నక్షత్రాల హోటళ్లు. చాలీచాలని సంపాదన నుంచి బయటపడేందుకు రాత్రివేళ ఇలా భోజనం తయారు చేస్తూ ఇంటికి ఆధారమవుతున్న గృహిణులూ, యువతీ యువకులు ఉన్నారు.
భావోద్వేగాల సంగమానికి వేదిక
నగర జీవనంతో ముడిపడిన మరో పార్శ్యం ఇది. పగలంతా బాధ్యతలతో తలమునకలైన తల్లిదండ్రులు.. బిడ్డలతో గడిపేందుకు రాత్రి అనువైన వేళ. కొత్తగా పెళ్లయిన జంటకు ఆటవిడుపు. స్నేహితులతో కాసేపు సరదాలను ఆస్వాదించే సమయం. నగరం ఆదమరచి నిద్రలోకి జారుకునేవేళ ఒంటరిగా నడచుకుంటూ కిలోమీటర్ల కొద్దీ నడుస్తున్న బాటసారులూ లేకపోలేదు. నిశీధి భావోద్వేగాలను పంచుకునేందుకు వేదిక అవుతుంది.పగలంతా కష్టపడుతూ పిల్లలతో గడపలేని ఓ తండ్రి కోరికను తీర్చుతుంది. బతుకుదెరువు కోసం నగరం పంచన చేరిన పేద, మధ్యతరగతి కుటుంబాలకు జీవితాన్నిస్తుంది. అందరూ భయపడే చీకటి.. బతుకుపై బోలెడంత నమ్మకాన్ని కూడా కలిగిస్తుంది.
వెలుగుల అందాలు.. కళ్లు జిగేలు!
సాయంత్రం కాగానే హుస్సేన్‌సాగర్ ప్రాంతం సందర్శకులతో సందడిగా మారుతుంది. చీకటిపడే కొద్దీ.. క్రమంగా జనం పలుచబడుతుంటారు. ఈ సమయంలో కొందరు కుటుంబ సభ్యులతో సేదతీరేందుకు వరుస కడతారు. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన పర్యాటకులు.. ట్యాంక్‌బండ్‌పై సరదాగా విహరించేందుకు ఆసక్తి చూపుతుంటారు. రంగురంగుల విద్యుత్ వెలుగుల్లో మెరుస్తూ కొత్త అనుభూతులను పంచుతుందంటున్నారు పర్యాటకులు. బెంగళూరులో ఉండే ఐటీ ఉద్యోగి రాజా కుటుంబంతో కలసి హైదరాబాద్ వచ్చారు. రాత్రివేళ నగరం అందాలు చూసేందుకు కారులో బయల్దేరి.. కొద్దిసేపు ట్యాంక్‌బండ్‌పై సేద తీరుతూ కనిపించారు. రాత్రి వేళ.. పిల్లలతో కలసి చల్లగాలిని పీల్చుతూ.. మనసుకు నచ్చిన ఐస్‌క్రీమ్‌ను ఆస్వాదిస్తుంటే ఆ ఆనందమే వేరన్నారు.
నిద్రపోని రహదారులు
షాపింగ్ మాల్స్.. మల్టీప్లెక్స్ కాంప్లెక్స్.. పబ్‌లు హద్దుల్లేని ఆనందాన్ని ఆస్వాదించేందుకు వేదికలు. ఉద్యోగ, వ్యాపార వర్గాలతో హడావిడిగా కనిపించే రహదారులు. ఎవరి జీవితం వారిదే అన్నట్టుగా మెలిగే మనుషులు. నిద్రలేచింది మొదలు కునుకుతీసేంత వరకూ పరుగులు. లక్ష్యం కోసం అలసిసొలసిన నగర జీవులు. చీకటిపడగానే గూటికిచేరి సేదతీరే జీవితాలు. పగలంతా గుండెలపై బరువు మోస్తూ.. గమ్యానికి చేర్చుతూ.. ఎన్నో సంఘటనలకు సాక్ష్యంగా నిలిచే రహదారులకు మాత్రం విశ్రాంతి ఉండదు. వాహన హారన్ల మోతలు.. పోలీసు సైరన్లు..వెలుగుతూ ఆరుతూ ఉండే ట్రాఫిక్ లైట్లు.. మద్యం మత్తు తలకెక్కి ఇంటికి చేరేందుకు నానా అవస్థలు పడుతూ కనిపించే మందుబాబులు. నిర్మానుష్యంగా కనిపించే కాలనీలు. మహానగర జీవనంలో ఇది ఓ వైపు మాత్రమే.
సాయం చేయడంలో ఆనందం
ఇక్కడ ద్విచక్రవాహనాలపై ఉన్న వారంతా.. గచ్చిబౌలిలోని ఓ సంస్థ ఉద్యోగులు. బిహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ తదితర రాష్ట్రాల నుంచి వచ్చారు. పగటి వేళ విధులు ముగించుకున్న వీరంతా.. రాత్రిళ్లు ఒకేచోట కలిసి ఆనందాలు పంచుకుంటారు. నగరమంతటా షికార్లు కొడుతుంటారు. ఇలా తిరిగే బిష్ణు, వివేక్, చత్తీస్‌రాజా, సౌరభ్ సహకార్, ఆకాష్ మిత్రబృందం ఫుట్‌పాత్‌లు, బస్టాప్‌లో ఎంతోమంది చలికి వణుకుతుండడాన్ని గమనించారు. అర్ధరాత్రి ఉస్మానియా ఆసుపత్రి నుంచి మెహిదీపట్నం వరకూ రహదారి పక్కన ముడుచుకుని పడుకున్న వారికి తమ వద్ద ఉన్న కొద్దిపాటి సొమ్ముతో కొన్న దుప్పట్లు కప్పుతూ ముందుకు సాగారు. మేము ఎవరిమో తెలియకుండా సాయం చేయడంలో మరింత ఆనందం దాగుందని ఆ స్నేహితులు చెప్పారు.
చార్మినార్ సోయగం.. కేరింతల యువజనం
చార్మినార్ సోయగాన్ని వీక్షించాలనుకునే వారికి అదే అనువైన వేళ. రాత్రి 12 గంటలు దాటగానే అక్కడకు చేరి వేడుకలు జరుపుకోవడాన్ని ఆస్వాదిస్తున్న జంటలూ ఉన్నాయి. కొత్త దంపతులు.. బైక్‌పై చక్కర్లు కొడుతూ చార్మినార్ వద్దకు చేరి అల్పాహారం ఆస్వాదించడాన్ని ఇష్టపడుతున్నారని స్థానిక దుకాణదారు తెలిపారు. అర్ధరాత్రి దాటేంత వరకు అక్కడ యువత కేరింతలు కొడుతూనే ఉంటారు. మాదాపూర్‌కి చెందిన జగదీష్ ఐటీ ఉద్యోగి. భార్య సాయి సుమదీప్తిక పుట్టినరోజు వేడుకలకు చార్మినార్‌ను వేదికగా మార్చుకున్నారు. స్నేహితుల సమక్షంలో కేక్ కోసి జీవిత భాగస్వామికి శుభాకాంక్షలు చెప్పారు.
నెలకు రూ.20వేలు సంపాదన
" మూడేళ్ల కిందట నగరానికి వచ్చాం.. కంపెనీలో పనిచేయడంతో వచ్చే ఆదాయాన్నే సర్దుకునేవాళ్లం. ఇప్పుడు ఇద్దరు పిల్లలు.. ఖర్చులు పెరిగాయి, అప్పులు చేసి చదివించడం ఇష్టంలేదు. దాచుకున్న డబ్బుతో ఆటో కొనుగోలు చేశాం. ఇంట్లో చేసినట్టుగానే ఇడ్లీ, దోసెలు వేస్తూ.. ప్రతినెలా ఖర్చులు పోనూ రూ.ఇరవై వేలు సంపాదిస్తున్నా."
- రుక్మిణి, మాదాపూర్‌లో భోజనశాల నిర్వహించే గృహిణి
డబ్బు విలువ తెలిసింది
" బీటెక్ చదువుతూ ఐస్‌క్రీమ్ అమ్ముతూ సంపాదన విలువ తెలుసుకున్నా. మొదట్లో నామోషీ అనిపించినా నా తొలి ఆదాయం ఇంట్లో ఇచ్చినపుడు కలిగిన సంతోషం దాన్ని దూరం చేసింది. రోజూ రాత్రి 9.30కు ట్యాంక్‌బండ్ వద్దకు వస్తాను. తెల్లవారుజామున 2 వరకూ తిరుగుతూ ప్రతి నెలా రూ.10వేలు సంపాదిస్తున్నా."
- రెహ్మాన్, బీటెక్ విద్యార్థి, పాతబస్తీ