ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ వాదనలు వినేందుకు జాతీయ హరిత ట్రైబ్యునల్ అంగీకరించింది. రాయలసీమ ఎత్తిపోతలపై ఇప్పటికే తెలంగాణ వాసి గరివోళ్ల శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్ పై తీర్పును రిజర్వ్ చేసిన ఎన్జీటీ చెన్నై ధర్మాసనం.. తెలంగాణ వేసిన తాజా అప్లికేషన్‌తో తిరిగి కేసును తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. రాయలసీమ ఎత్తిపోతలపై తెలంగాణకు ఉన్న అభ్యంతరాలను ఈ నెల 28న తుది వాదనలు వింటామని జస్టిస్ రామకృష్ణన్ ధర్మాసనం స్పష్టం చేసింది.
ఇంతకుముందు జరిగిన విచారణలో నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికపై అభ్యంతరాలు తెలిపేందుకు తగిన సమయం లేకుండా పోయిందని.. కేసును మళ్లీ తెరిచి తమ వాదనలు వినాలని రాష్ట్ర ప్రభుత్వం అప్లికేషన్ వేసింది. నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక లోపభూయిష్టంగా ఉందని.. తమ వాదనలు వినకపోతే రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందని తెలంగాణ ప్రభుత్వం అప్లికేషన్లో పేర్కొంది.
రాష్ట్ర ప్రభుత్వం వేసిన అప్లికేషన్‌పై ఆంధ్రప్రదేశ్ తరఫు సీనియర్ న్యాయవాది వెంకటరమణి అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ అప్లికేషన్‌పై తమకేమి అభ్యంతరం లేదని గత పిటిషనర్ చెప్పగా... కేసును తిరిగి తెరిచి వాదనలు వింటామని ఎన్జీటీ పేర్కొంది. తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది.