New Year traffic rules in Hyderabad: నయాసాల్ వేడుకలకు నగరం ముస్తాబైంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్లలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. రోడ్డు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ట్రిపుల్ రైడింగ్, డ్రంకన్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్‌పై కేసులు నమోదు చేయనున్నట్టు ప్రకటించారు. నేటి రాత్రి నుంచి జనవరి 1 వరకూ పలు ప్రాంతాల్లో ఆంక్షలు విధిస్తున్నట్టు ప్రకటించారు. శనివారం అర్ధరాత్రి నుంచి బేగంపేట్, లంగర్‌హౌస్ మినహా అన్ని పైవంతెనలపై రాకపోకలు నిలిపివేయనున్నారు.
నిబంధనలు పాటించండి..: డ్రంకన్ డ్రైవ్‌లో దొరికిపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ టి.శ్రీనివాసరావు తెలిపారు. మొదటిసారి చిక్కితే రూ.10,000 జరిమానా, 6 నెలల జైలుశిక్ష, రెండోసారైతే రూ.15,000, 2 సంవత్సరాల శిక్ష తప్పదన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ సీజ్ చేసి సస్పెన్షన్‌కు రవాణా శాఖకు పంపుతామన్నారు. మొదటిసారి 3 నెలల సస్పెన్షన్, రెండోసారి పట్టుబడిన వారి లైసెన్స్ శాశ్వతంగా రద్దవుతుందన్నారు. వాహనదారులు నిబంధనలు పాటించి సహకరించాలని డీసీపీ సూచించారు.
ఇవీ చదవండి: