ETV Bharat / state

New Symptoms in Corona: పిల్లల్లో కరోనా కొత్త లక్షణాలివే..!

author img

By

Published : Jan 13, 2022, 9:49 AM IST

New Symptoms in Corona
కరోనా లక్షణాలు

New Symptoms in Corona: కరోనా విజృంభిస్తున్న వేళ పిల్లల విషయంలో తల్లితండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాలని పిల్లల వైద్య నిపుణులు సూచిస్తున్నారు. డెల్టా వేరియంట్​తో పోలీస్తే.. ఒమిక్రాన్​ కారణంగా పిల్లల్లో కొత్త లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్యులు చెప్తున్నారు.

New Symptoms in Corona: ఒమిక్రాన్‌ వేరియంట్‌ రూపంలో కరోనా మూడో దశ విజృంభిస్తోంది. పిల్లలపై కూడా ప్రభావం చూపుతోంది. తెలుగు రాష్ట్రాల్లో అనూహ్యంగా కేసులు పెరుగుతున్నాయి. అమెరికాలో 23-30 శాతం మంది పిల్లలు ఒమిక్రాన్‌ బారిన పడుతున్నారు. మన వద్ద కూడా పిల్లల్లో కేసులు నమోదవుతున్నాయి. డెల్టా వేరియంట్‌తో పోలిస్తే ఒకటి రెండు కొత్త లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. కొందరు చిన్నారులకు కడుపు నొప్పి రావడంతోపాటు వాంతులు అవుతున్నాయి. జ్వరం, ఇతర సమస్యలు తక్కువగా కనిపిస్తున్నాయి. చాలామంది తల్లిదండ్రులు దీనిని అజీర్ణ సమస్యగా భావిస్తున్నారు. ప్రాథమిక వైద్యంతో కొందరిలో తగ్గిపోతోంది. మరికొందరు మాత్రం వైద్యులను సంప్రదిస్తున్నారు. పరీక్షలు చేస్తే కరోనా ఉన్నట్లు నిర్ధారణ అవుతోంది. డెల్టా వేరియంట్‌లో పిల్లల్లో కడుపు నొప్పి కనిపించేది కాదని, అప్పట్లో వాంతులు, విరేచనాలు, జలుబు, దగ్గు, ఆయాసం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది లాంటి సమస్యలను గుర్తించామని వైద్యులు చెబుతున్నారు.

ఆక్సిజన్‌పై ఇద్దరు..

ప్రస్తుతం గాంధీ ఆసుపత్రి పిల్లల వార్డులో అయిదుగురు చిన్నారులు కరోనాకు చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇద్దరికి ఆక్సిజన్‌తో చికిత్స అందిస్తున్నారు. అందరి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం పిల్లల్లో తలనొప్పి, 101-102 డిగ్రీల జ్వరం, కడుపులో నొప్పి, వాంతులు, విరేచనాలు లాంటి లక్షణాలు ఉంటే కరోనాగా భావించి పరీక్షలు చేయించాలని సూచిస్తున్నారు.

మాస్క్‌లు ధరించేందుకు అవకాశం లేక...

మూడోదశ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో 5 ఏళ్లలోపు పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. వారికి మాస్క్‌ పెట్టడం లేదు. పెట్టినా వారు కిందకు లాగేస్తుంటారు. దీంతో ఎక్కువ శాతం వీరు ముప్పు కేటగిరిలో ఉంటారు. ఈ వయస్సు పిల్లలకు టీకాలు కూడా ఇంకా అందుబాటులోకి రాలేదు. ఈ తరుణంలో తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాలని చిన్న పిల్లల వైద్య నిపుణులు మంచుకొండ రంగయ్య సూచించారు.

ఇదీ చూడండి: సీజనల్​ వ్యాధులకు చెక్​ పెట్టండిలా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.