New Ration Cards in Telangana : తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ నెల 28 నుంచి దరఖాస్తులు ఆహ్వానించేందుకు రాష్ట్ర సర్కార్ సన్నద్ధం అవుతోంది. మీ-సేవా ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు తీసుకోనున్నట్లు తెలిసింది. అర్హుల ఎంపిక ప్రక్రియను క్షేత్రస్థాయిలోనే చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇందుకు సంబంధించి అవసరమైన పత్రాలతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేశాక, వీటి పరిశీలన జరగనుంది. అర్హుల ఎంపిక ప్రక్రియ గ్రామాల్లో గ్రామ సభలు, నగరాలు, పట్టణాల్లో బస్తీ సభల ద్వారా జరుగుతుందని పౌర సరఫరాల శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రక్రియకు ప్రత్యేకంగా నోడల్ అధికారులను నియమించనున్నట్లు తెలుస్తోంది.
లక్షల కుటుంబాల ఎదురుచూపులు : తెలంగాణలో నూతన రేషన్ కార్డుల (Telangana Ration Card) కోసం లక్షల కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. మరోవైపు బియ్యం వంటి సరకుల కోసమే కాకుండా ఆరోగ్యశ్రీ వంటి పలు పథకాలకూ రేషన్ (ఆహార భద్రత) కార్డు ఉండాలన్న నిబంధన కూడా ఉంది. ఆరోగ్యశ్రీ పరిమితిని రాష్ట్ర సర్కార్ ఇటీవలే రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచింది. అర్హత కలిగినప్పటికీ అనేక కుటుంబాలు రేషన్ కార్డుల్లేక ప్రభుత్వ పథకాలకు సంబంధించి లబ్ధి పొందలేకపోతున్నాయి.
మార్గదర్శకాలు ఖరారు చేయాల్సి ఉంది : రేషన్ కార్డులో పేరున్న ప్రతి వ్యక్తికి 6 కిలోల చొప్పున బియ్యం ఇస్తున్నారు. హైదరాబాద్‌లో గోధుమలు కూడా పంపిణీ చేస్తున్నారు. గతంలో కిలో బియ్యం రూపాయికే ఇవ్వగా, కరోనా ప్రభావం నేపథ్యంలో మూడు సంవత్సరాలుగా ఉచితంగానే బియ్యం ఇస్తున్నారు. అన్నపూర్ణ అంత్యోదయ యోజన కార్డులు ఉన్నవారికి నెలకు కిలో చక్కెర ఇస్తున్నారు. కాగా రేషన్ కార్డుల జారీకి, అర్హుల ఎంపికకు మార్గదర్శకాలు ఖరారు చేయాల్సి ఉంది. గతంలో ఉన్న మార్గదర్శకాలే కొనసాగే అవకాశాలు లేకపోలేదని పౌరసరఫరాలశాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు. ప్రతిపాదనలు ప్రభుత్వానికి చేరాయని, కొత్త రేషన్ కార్డులకు అర్హుల ఎంపిక గ్రామ, బస్తీ సభల్లోనే జరుగుతుందని అధికారులు తెలియజేస్తున్నారు.
మార్పులు చేర్పులు సైతం : రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులు, తప్పులను సరిచేయడానికి సైతం ఈనెల 28 నుంచి అవకాశం కల్పించనున్నట్లు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల ముందు నాటికే ఈ జాబితాలో 11.02 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటికే ఉన్న కార్డుల్లో పిల్లలు, కుటుంబసభ్యుల పేర్లు చేర్చాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు. ఎడిట్ ఆప్షన్ రాష్ట్ర సర్కార్ ఇవ్వకపోవడంతో ఆ ప్రక్రియ ఇన్నాళ్లూ ముందుకు సాగలేదు.
New Ration Cards Applications Starts December 28th : తెలంగాణలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. నూతన కార్డుల జారీకి దరఖాస్తుల ఆహ్వానంతో పాటు ఇప్పటికే ఉన్న కార్డుల్లో కుటుంబ సభ్యుల్ని చేర్చేందుకు అనుమతివ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. 11.02 లక్షల దరఖాస్తులకు సంబంధించి 15.87 లక్షల మంది పేర్లను ఆహారభద్రత కార్డుల్లో చేరాలని ఇప్పటికే దరఖాస్తులు వచ్చాయి. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
- తెలంగాణ ఆవిర్భవించాక 6,47,297 రేషన్‌కార్డులు జారీచేసినట్లు పౌరసరఫరాలశాఖ గణాంకాలు చెబుతున్నాయి. వీటికింద 20,69,033 మంది లబ్ధిదారులు ఉన్నారు.
- తెలంగాణలో ఇంతవరకు మొత్తం 2.82 కోట్ల మందికి పైగా రేషన్ లబ్ధిదారులు ఉన్నారు. ఇందులో ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ కింద 1,91,69,000 (68%), రాష్ట్ర కార్డులకు సంబంధించి 91,30,000 (32%) మంది ఉన్నారు.