మీకు బైకు, కారు వంటి వాహనాలు ఉన్నాయా? మీ వాహన కాలుష్యం పరిమితిలోనే ఉన్నట్లు ధ్రువీకరణ పత్రం (పీయూసీ) ఉందా? కాలుష్య పరీక్ష చేయించి చాన్నాళ్లయ్యిందా? ఇక నుంచి జాప్యం చేస్తే కుదరదు. ఒక్కరోజు ఆలస్యమైనా మీ వాహనంపై జరిమానా పడిపోతుంది. ఎందుకంటే ‘ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ కమిటీ’ ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించింది. దీనికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ మొదలైంది. నూతన విధానంలో వాహన కాలుష్య పరీక్షలు, ఫలితాల్ని ఆన్‌లైన్ చేయబోతున్నారు. అంటే మీ బండికి కాలుష్య పరీక్ష చేస్తే ఆ వివరాలు, ఫలితం సర్వర్‌కు వెళ్లిపోతాయి. రవాణాశాఖ, పోలీస్‌శాఖలకూ చేరిపోతాయి. ఆరు నెలల గడువులోపు కాలుష్య పరీక్ష చేయించకపోతే జరిమానా పడిపోతుంది. ఆగస్టులో ఈ కొత్త విధానం అమల్లోకి వస్తుందని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారులు చెబుతున్నారు.
ఇదీ చూడండి: నీటిలో చిక్కుకున్న బాధితులను రక్షించేందుకు అగ్నిమాపక శాఖ సన్నద్ధం
తొలుత హైదరాబాద్‌లో..
రాష్ట్రంలో వాయుకాలుష్యంలో దాదాపు 50శాతానికి పైగా వాహనాల నుంచే వస్తోంది. ఈ నేపథ్యంలో వాహన కాలుష్య కట్టడికి కాలుష్య ధ్రువీకరణ పరీక్షలు, ఫలితాల్ని ఆన్‌లైన్‌తో అనుసంధానం చేయాలని ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ కమిటీ నిర్ణయించింది. పీసీబీ, రవాణా, పోలీసు, పురపాలక తదితర శాఖలు ఈ కమిటీలో ఉన్నాయి. తొలుత హైదరాబాద్‌లో అమలు చేసి తర్వాత రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని కమిటీ నిర్ణయించినట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా 1.38 కోట్ల వాహనాలు ఉండగా.. హైదరాబాద్‌లోని వాహనాల నుంచే రోజుకు 1,500 టన్నుల కాలుష్య ఉద్గారాలు విడుదలవుతున్నాయి.
కాలుష్యం తగ్గే అవకాశం
వాహన కాలుష్య నియంత్రణ కోసం కఠిన నిబంధనలు ఉన్నాయి. కానీ వాటిని అమలు పరచడంలో అధికారులు విఫలమవుతున్నారు. కాలుష్య ధ్రువీకరణ పత్రం ఉందా? లేదా? అనే విషయాన్ని పరిగణలోకి తీసుకుంటున్నారు. కానీ వాటిలో ఎంత మోతాదు కాలుష్య కారకాలున్నాయనే అంశాన్ని విస్మరిస్తున్నారు. దీంతో కాలుష్యానికి అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ఈ క్రమంలో వాహనాలు కాలుష్యాన్ని చిమ్ముతూ ప్రజల ఆరోగ్యాన్ని హరించేస్తున్నాయి. ఈ నూతన విధానంతో కాలుష్యం తగ్గే అవకాశం ఉందని కాలుష్య నియంత్రణ మండలి అధికారులు అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చదవండి: వ్యవసాయేతర భూములు, ఆస్తుల విలువ పెంపునకు రంగం సిద్ధం