హైదరాబాద్, సికింద్రాబాద్‌లోని రైల్వేస్టేషన్లు, బాగ్‌లింగంపల్లి, సచివాలయం తదితర ప్రాంతాల ఫుట్‌పాత్‌లపై ఉంటూ... జీవనం సాగించే అభాగ్యులకు నిత్యం అన్నదాన కార్యక్రమాన్ని న్యూలైఫ్ ఫౌండేషన్ శ్రీకారం చుట్టింది. హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లి, వనస్థలిపురం, పాతబస్తీ, అత్తాపూర్, రాంపల్లి, సికింద్రాబాద్ ప్రాంతాలకు చెందిన 8మంది వ్యక్తులు వివిధ ఉద్యోగాలు చేస్తూ.. సమాజ సేవ చేయాలని సంకల్పించారు. గతేడాది కరోనా మహమ్మారి విలయ తాండవం చేసిన నాటి నుంచి.. అభాగ్యులను ఆదుకోవాలని సంకల్పంతో ఈ బృందం ముందుకు సాగుతోంది.
నాటి నుంచి ప్రతిరోజు ఉదయం, సాయంత్రం సమయాల్లో దాదాపు 500 మందికి బాగ్‌లింగంపల్లి, నాంపల్లి రైల్వేస్టేషన్, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ తదితర ప్రాంతాల్లోని అభాగ్యులకు పులిహోర, పెరుగన్నం ఇతర ఆహార పదార్థాలను ఆ సంస్థ అందిస్తోంది. ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా ద్విచక్రవాహనంపై వచ్చి ఆ అభాగ్యులకు ఆహార పొట్లాలను అందజేసి వెళ్లడం అందరినీ ఆనందానికి గురిచేసింది.
కరోనా రెండవ దశ సమయంలో కూడా అన్నదాన కార్యక్రమంతో పాటు కరోనా బాధితులకు నెలవారి నిత్యావసర సరుకులు పౌండేషన్ ప్రతినిధులు అందచేసింది. అదేవిధంగా అవసరమైనవారికి వారి ఆర్థిక పరిస్థితిని బట్టి ఆరు లీటర్ల ఆక్సిజన్ సిలిండర్లను ఉచితంగా అందజేశారు. హైదరాబాద్ బాగ్‌లింగంపల్లి ఆర్టీసీ కళాభవన్ వద్ద ఉన్న న్యూ లైఫ్ ఫౌండేషన్ ప్రతినిధులు ఆహార పొట్లాలను అందజేశారు.
ఇదీ చదవండి: చికిత్స కోసం వచ్చే ఇతర రాష్ట్రాల రోగులకు మార్గదర్శకాలు