తెలుగు రాష్ట్రాలకు నలుగురు న్యాయమూర్తులను నియమించాలంటూ కేంద్రానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు ముగ్గురు, తెలంగాణకు ఒకరిని కేటాయించింది. న్యాయవాదులు బొప్పుడి కృష్ణమోహన్, కె.సురేష్‌రెడ్డి, కె.లలిత కుమారి అలియాస్ లలితలను ఏపీ హైకోర్టుకు, తెలంగాణ హైకోర్టుకు న్యాయవాది బి.విజయసేన్‌రెడ్డిని న్యాయమూర్తులుగా నియమించాలంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే, జస్టిస్ ఎన్‌వీ రమణ, జస్టిస్ అరుణ్‌కుమార్ మిశ్ర, జస్టిస్ రోహింటన్ ఫాలీ నారీమన్, జస్టిస్ ఆర్.భానుమతిలతో కూడిన కొలీజియం సోమవారం సిఫార్సు చేసింది.
- బొప్పూడి కృష్ణమోహన్ (ఏపీ హైకోర్టు)
బి.కృష్ణమోహన్ 1965 ఫిబ్రవరి 5న గుంటూరులో జన్మించారు. తల్లి సావిత్రి, తండ్రి బి.ఎస్.ఆర్. ఆంజనేయులు. గుంటూరు హిందూ కాలేజీలో బీఎస్సీలో పట్టభద్రుడైన ఆయన ఏసీ లా కాలేజీలో న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1989 మార్చిలో బార్ కౌన్సిల్‌లో ఎన్‌రోల్ చేయించుకున్న ఆయన ఉమ్మడి హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్టాండింగ్ కౌన్సిల్‌గా, సహాయ ప్రభుత్వ న్యాయవాదిగా, జాతీయ బ్యాంకులు, ఇతర సంస్థల తరఫు న్యాయవాదిగా సేవలందించారు. 10 ఏళ్లపాటు కేంద్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదిగా ఉన్న ఆయన ప్రస్తుతం హైకోర్టు విభజన అనంతరం ఏపీ హైకోర్టులో కేంద్రం తరఫున సహాయ సొలిసిటర్ జనరల్‌గా 2019 నుంచి కొనసాగుతున్నారు.
- కంచిరెడ్డి సురేష్‌రెడ్డి (ఏపీ హైకోర్టు)
1964 డిసెంబరు ఏడున జన్మించారు. స్వగ్రామం అనంతపురం జిల్లా శింగనమల మండలం తరిమెల. శôకర్‌రెడ్డి, లక్ష్మీదేవిల కుమారుడు. అనంతపురం ప్రభుత్వ కాలేజీలో బీఏ చదివారు. కర్ణాటకలోని గుల్బర్గా యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పొందారు. 1989 సెప్టెంబరులో న్యాయవాదిగా నమోదు అయ్యారు. ప్రముఖ న్యాయవాది టి.బాల్‌రెడ్డి వద్ద జూనియర్‌గా వృత్తిని ప్రారంభించారు. హైకోర్టులో క్రిమినల్, సివిల్, రాజ్యాంగానికి సంబంధించిన కేసుల్లో పట్టు సాధించారు.
- కన్నెగంటి లలితకుమారి (ఏపీ హైకోర్టు)
లలితకుమారి గుంటూరు జిల్లా బాపట్ల మండలంలో అంకమ్మ చౌదరి, అమరేశ్వరిలకు 1971 మే 5న జన్మించారు. హైదరాబాద్‌లోని పడాల రామిరెడ్డి లా కాలేజీలో న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1994 డిసెంబరు 28న బార్ కౌన్సిల్‌లో ఎన్‌రోల్ చేయించుకుని హైకోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించారు. సివిల్, క్రిమినల్, రాజ్యాంగంతో పాటు సర్వీసు, నాన్‌సర్వీసు, మోటారు వాహనాలు, దాంపత్య వివాదాల కేసుల్లో వాదనలు వినిపించారు. ఆంధ్ర ప్రాంత వ్యవసాయ మార్కెట్ కమిటీ, ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ), ఏపీ దేవాదాయ శాఖ, తితిదే, ఎస్వీ వేదిక్ యూనివర్సిటీలకు స్టాండింగ్ కౌన్సెల్‌గా పనిచేశారు. ప్రస్తుతం తిరుపతి సంస్కృత విశ్వవిద్యాలయం స్టాండింగ్ కౌన్సెల్‌గా కొనసాగుతున్నారు.
- విజయ్‌సేన్‌రెడ్డి (తెలంగాణ హైకోర్టు)
బి.విజయ్‌సేన్‌రెడ్డి 1970 ఆగస్టు 22న హైదరాబాద్‌లో జన్మించారు. ఆయన తండ్రి జస్టిస్ బి.సుభాషణ్‌రెడ్డి. ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా, మద్రాసు, కేరళ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తిగా, ఉమ్మడి రాష్ట్రంలో మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్‌గా, లోకాయుక్తగా పనిచేశారు. విజయసేన్‌రెడ్డి పీఆర్‌ఆర్ లా కాలేజీలో న్యాయశాస్త్రంలో పట్టా తీసుకుని 1994 డిసెంబర్‌లో బార్ కౌన్సిల్‌లో ఎన్‌రోల్ అయ్యారు. రాజ్యాంగ, సివిల్, క్రిమినల్, సర్వీసు, భూసేకరణ, యూఎల్సీ, ఆర్బిట్రేషన్, పౌరసరఫరాలకు చెందిన రంగాల్లో అనేక కేసులు వాదించారు.
ఇదీ చదవండిః 'జూమ్' యాప్ ఎందుకు సురక్షితం కాదంటే...!