పులికాట్ సరస్సు-నేలపట్టు పక్షుల కేంద్రానికి ఏటా విదేశీ విహంగాలు వస్తుంటాయి. పెలికాన్స్, గూడబాతులు, కొంగలు వంటి 25 రకాల విదేశీ పక్షులు ఇక్కడ సందడి చేస్తాయి. ఇవన్నీ గాల్లో విహరిస్తుంటే పర్యాటకులు వీటిని చూస్తూ ఆనందం పొందుతారు. ఫొటోగ్రాఫర్లు తమ కెమెరాలతో వాటి అందాలను బంధిస్తారు. శాస్త్రవేత్తల పరిశోధనలకూ ఇవి ఉపయోగపడతాయి.
ఏడు దేశాల నుంచి...
ఏడు దేశాల నుంచి వేల కిలోమీటర్లు ప్రయాణించి విదేశీ విహంగాలు పులికాట్ సరస్సుకు వస్తుంటాయి. ఐదు నెలలు ఇక్కడే ఉండి సంతానోత్పత్తి చేస్తాయి. తరువాత వాటి పిల్లలతో సహా తమ స్వదేశాలకు ప్రయాణమవుతాయి. ఈ ఐదు నెలలూ పులికాట్ సరస్సులో అవి చేసే సందడి అంతా ఇంతా కాదు. రైతులు, మత్స్యకారులు, అధికారులు వీటిని సంరక్షిస్తారు. దేవతా పక్షులుగా పిలుస్తూ.. ఎవరూ వాటికి హాని చేయకుండా చూస్తారు.
కుటుంబ సమేతంగా...
పులికాట్ సరస్సు మధ్యలోనే అంతరిక్ష ప్రయోగ కేంద్రం శ్రీహరికోట ఉంది. చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారి సమీపంలోనే పులికాట్ ఉండటంతో ఈ మార్గంలో ప్రయాణించేవాళ్లంతా ఓసారి పక్షుల సందడి చూసి వెళ్తుంటారు. అటకానితిప్ప, భీమునిపాలెం, నేలపట్టు, సూళ్లూరుపేటలోని ఆహ్లాదకర వాతావరణంలో విదేశీ విహంగాలను సందర్శిస్తారు. బోటు షికారుతో పాటు రిసార్టులు ఉండటంతో కుటుంబసమేతంగా ఇక్కడికి పర్యాటకులు వస్తుంటారు.
పక్షుల సందడి వీక్షించాల్సిందే..!
పల్లెపాడు, మైపాడు, కావలిలో సముద్రతీర స్నానాలకు వెళ్లేవాళ్లు, రెండో శ్రీరంగంగా పిలిచే నెల్లూరులోని రంగనాథస్వామి ఆలయం, పెంచలకోన పుణ్యక్షేత్ర దర్శనానికి వచ్చేవాళ్లు విదేశీ విహంగాల సందడిని వీక్షిస్తుంటారు. కొండలమధ్య సహజసిద్ధంగా ఏర్పడిన పెద్ద జలపాతాలు చూసేందుకు వచ్చే సందర్శకులు పులికాట్ అందాలతోపాటు విదేశీ పక్షుల సందడిని వీక్షించేందుకు మొగ్గుచూపుతారు.
ఇదీ చదవండి : ఎన్నికలకు సంబంధం లేని అంశాలు ప్రస్తావిస్తున్నారు: కేటీఆర్