Agricultural Development Funds: వ్యవసాయాభివృద్ధికి దోహదపడే నిధుల వినియోగంపై నిర్లక్ష్యం చూపుతున్నారు. జాతీయ వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి’ (ఏఐఎఫ్) నుంచి రాష్ట్రానికి ప్రాజెక్టులు, నిధుల మంజూరు చాలా తక్కువగా ఉంది. పలు రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ వెనుకబడి ఉంది. గ్రామస్థాయిలో రైతులకు సేవలందించాల్సిన ‘ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల’(ప్యాక్స్)కు కేవలం ఒక్కశాతం వడ్డీతో ఈ నిధి నుంచి రాష్ట్రంలో రూ.3075 కోట్ల రుణాలివ్వాలని నాబార్డు సంకల్పించింది. గోదాములు, శీతల గిడ్డంగులు మొదలుకొని వ్యవసాయానికి ఉపయోగపడే ఏ నిర్మాణం చేపట్టినా ఒక్కో సంఘానికి రూ.2 కోట్ల వరకూ ఈ నిధి నుంచి రుణం ఇస్తారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (ఎఫ్‌పీఓ), రైతులు, పారిశ్రామికవేత్తలు ...ఇలా ఎవరైనా వ్యవసాయ సంబంధ నిర్మాణాలను చేపట్టడానికి మంజూరుచేయాలని కేంద్రం ‘ఆత్మనిర్భర్ భారత్’ పథకం కింద ఏఐఎఫ్‌ను రూ.లక్ష కోట్లతో ఏర్పాటుచేసింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 23,475 సంఘాలు, వ్యక్తులు దరఖాస్తులిస్తే 8,658 ప్రాజెక్టులను రూ.6,205 కోట్లను కేంద్రం మంజూరుచేసింది. వీటిలో ఇప్పటికి 4270 ప్రాజెక్టులకు రూ.2256 కోట్లను విడుదల చేసింది. కానీ మొత్తం 8658లో కేవలం 6 రాష్ట్రాలకే 71.17 శాతం (6162) ప్రాజెక్టులు మంజూరుకావడం గమనార్హం. వీటిలో తెలంగాణ లేదు.
సత్తాలేని సంఘాలు...
ప్యాక్స్ తరఫున వ్యవసాయానికి ఉపయోగపడే గోదాములాంటి ఏ నిర్మాణం చేపట్టినా రూ.2 కోట్లవరకూ రుణం ఇస్తారు. దానిపై వసూలుచేసే 4 శాతం వడ్డీలో 3 శాతాన్ని రాయితీగా నాబార్డు భరిస్తే మిగిలిన ఒక్కశాతాన్ని ప్యాక్స్ కట్టాలి. రాష్ట్రంలో మొత్తం 909 ప్యాక్స్ ఉంటే ఒకటి బాగాలేదని మూసివేశారు. మిగిలిన 908 సంఘాల్లో 200 మాత్రమే గతేడాది 361 ప్రాజెక్టులకు రూ.153.10 కోట్ల రుణం కోసం దరఖాస్తులిచ్చాయి. వాటిలో 127 సంఘాలకు చెందిన 138 ప్రాజెక్టులకే రుణం మంజూరవగా అందులోనూ రూ.8 కోట్లు మాత్రమే విడుదల చేశారు.నల్గొండ జిల్లా డిండి ప్రాథమిక వ్యవసాయ సంఘం రూ.2 కోట్లు కావాలని 6 నెలల క్రితం దరఖాస్తు చేయగా ఫలితం శూన్యం. మెదక్ జిల్లా చిన్నఘనపూర్ ప్యాక్స్ దరఖాస్తు చేస్తామని అడిగితే అది సహకార బ్యాంకు పరిధిలో లేదని తిరస్కరించారు. ఈ పథకం అమలుపై పర్యవేక్షణకు రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంకు(టెస్కాబ్)లో పర్యవేక్షణ విభాగం ఏర్పాటుచేశారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో ప్రాజెక్టులకు దరఖాస్తు, మంజూరు, నిధుల విడుదల చాలా తక్కువగా ఉందని ఓ అధికారి చెప్పారు. ఆసక్తిగల రైతులెవరైనా సంఘంగా ఏర్పడి ఈ నిధికి సమీపంలోని సహకార బ్యాంకు ద్వారా దరఖాస్తు చేస్తే తక్కువ వడ్డీకి రూ.2 కోట్ల రుణం వస్తుంది. కానీ ఈ దిశగా రైతులను ప్రోత్సహించేవారు లేక ఎవరూ ముందుకు రావడం లేదు.
ఇదీ చూడండి: Omicron effect on Children: 'పిల్లలపైనా ఒమిక్రాన్ ప్రభావం.. బాధితుల్లో 22 శాతం చిన్నారులే'