ఇవాళ్టి నీట్ పరీక్షకు సర్వం సిద్ధమైంది. కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది దేశవ్యాప్తంగా 202 నగరాలు, పట్టణాల్లో 3 వేల 842 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా సుమారు 16 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. అందులో తెలంగాణ నుంచి దాదాపు 55వేలు, ఏపీ నుంచి సుమారు 50వేల మంది ఉన్నారు. తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, హయత్ నగర్ పట్టణాల్లో 112... ఆంధ్రప్రదేశ్లో కర్నూలు, నెల్లూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, తెనాలి, నరసరావుపేట, మచిలీపట్నం, మంగళగిరి పట్టణాల్లో 151 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జాతీయ పరీక్షల సంస్థ వెల్లడించింది. ఇవాళ మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు నీట్ జరగనుంది. మధ్యాహ్నం ఒకటిన్నర తర్వాత ఒక నిమిషం ఆలస్యమైనా కేంద్రంలోకి అనుమతి ఉండదని ఎన్టీఏ స్పష్టం చేసింది. ఆంగ్లంతో పాటు తెలుగు, హిందీ వంటి 13 భాషల్లో పరీక్ష ఉంటుంది.
నీట్ పరీక్ష నిబంధనలు
నీట్ పరీక్షకు పలు నిబంధనలు, ఆంక్షలను ఎన్టీఏ ఇప్పటికే ప్రకటించింది. నిబంధనలు బేఖాతరు చేస్తే మూడేళ్ల వరకు డిబార్ చేయనున్నట్లు వెల్లడించింది. అడ్మిట్ కార్డుతో పాటు పాస్ పోర్టు సైజు ఫొటో, ఆధార్, ఓటరు గుర్తింపు, పాన్ కార్డు వంటి ఏదైనా గుర్తింపు పత్రం తీసుకెళ్లాలి. అభ్యర్థులు కచ్చితంగా మాస్క్ ధరించాలని స్పష్టం చేసింది. చిన్న శానిటైజర్ తీసుకెళ్లవచ్చు. మంచినీళ్ల బాటిల్, ఆహారపదార్థాలను అనుమతించరు. అయితే అనారోగ్యంతో ఉన్నట్లు ఆధారాలు సమర్పిస్తే మందులు, పారదర్శకమైన నీటి సీసాను అనుమతిస్తారు. ఉంగరాలు, బ్రాస్లెట్లు, చెవి పోగులు, ముక్కు పుడకలు, గొలుసులు, నెక్లెస్లు, హెయిర్ పిన్, హెయిర్ బ్యాండ్, తాయత్తులు, పర్సులు, హ్యాండ్ బ్యాగులు, బూట్లు, పొడవు చేతుల చొక్కాలు, చేతి గడియారాలు, పెన్ను, పెన్సిల్, రబ్బరు, కాగితాలు, ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని ఎన్టీఏ స్పష్టం చేసింది. పరీక్ష రాసేందుకు అవసరమైన పెన్నును కేంద్రంలోనే ఇస్తారు. పరీక్ష పూర్తయ్యే వరకు కేంద్రం నుంచి బయటకు వెళ్లనీయరు.
ఈ ఏడాది 200 ప్రశ్నలు
నీట్ పరీక్షలో ఈ ఏడాది 200 ప్రశ్నలు ఉంటాయి. అయితే 180 ప్రశ్నలకే సమాధానం ఇస్తే సరిపోతుంది. ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కులు కేటాయిస్తారు. నెగెటివ్ మార్కులు ఉంటాయి కాబట్టి.. కచ్చితంగా తెలిసిన సమాధానాలే రాయాలని నిపుణులు సూచిస్తున్నారు. సమాన మార్కులు వస్తే నెగెటివ్ మార్కులు తక్కువ ఉన్నవారికే ర్యాంకులో ప్రాధాన్యం ఇవ్వాలని ఈ ఏడాది ఎన్టీఏ నిర్ణయించింది. నీట్ ర్యాంకు ద్వారా దేశవ్యాప్తంగా 83 వేల 75 ఎంబీబీఎస్, 26,949 బీడీఎస్, 52,720 ఆయుష్, 525 బీవీఎస్, ఏహెచ్, 1899 ఎయిమ్స్, 249 జిప్మర్ సీట్లను భర్తీ చేయనున్నారు.
ఇదీ చదవండి: Medicine from the sky : వికారాబాద్‌లో మెడిసిన్ ఫ్రమ్ ది స్కై ప్రాజెక్టు ప్రారంభం