రాష్ట్రంలో కరోనా విలయతాండవం నేపథ్యంలో తాము నిత్యావసర వస్తువులు పంపిణీ చేయలేమని తెలంగాణ చౌక ధరల దుకాణాల డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు నాయికోటి రాజు పేర్కొన్నారు. థర్డ్ పార్టీ అథెంటికేషన్ ఇవ్వాలని కోరుతూ రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆయన పౌర సరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్‌కు వినతిపత్రం సమర్పించారు.
రాష్ట్రంలో కరోనా మహమ్మారి బారినపడి ఇప్పటి వరకు 45 మంది రేషన్ డీలర్లు చనిపోయారని వినతిపత్రంలో ప్రస్తావించారు. ప్రస్తుతం 400 మంది వరకు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ విపత్కర పరిస్థితుల్లో మే నెలకు సంబంధించిన రేషన్ సరుకులు పంపిణీ చెయ్యలేమన్నారు.
ప్రస్తుతం ఐరిష్, ఓటీపీ ద్వారా రేషన్ సరుకులు పంపిణీ చేస్తున్న దృష్ట్యా.. ఈ విధంగా బియ్యం పంపిణీ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది రేషన్ డీలర్లు కరోనా బారినపడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఉన్న విధంగా థర్డ్‌పార్టీ అథెంటికేషన్ ద్వారా రేషన్ సరుకులు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. చౌక ధరల దుకాణాల డీలర్లకు రక్షణ కల్పించడం సహా కరోనా బారినపడి చనిపోయిన డీలర్లకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని ఆయన కోరారు.