కొవిడ్ ప్రతి ఒక్కరి జీవితాలను అతలాకుతలం చేస్తోంది. మరీ ముఖ్యంగా పేదవారిపై ఎక్కువ ప్రభావం చూపుతోంది. కరోనా వైరస్ విజృంభణతో రెక్కాడితే గానీ డొక్కాడని రోజువారీ కూలీలకు ఉపాధికి కష్టకాలం వచ్చింది. అయితే ఆపత్కాలంలో మానవతావాదులు దాతృత్వంతో అభాగ్యులను ఆదుకుంటున్నారు. కొందరు యువకులు నవ్యశ్రీ ఫౌండేషన్ ద్వారా పేదలకు ఆహారం, నీళ్లు అందిస్తూ దాతృత్వం చాటుకున్నారు. కూకట్‌పల్లి, నాంపల్లి, అపోలో, నీలోఫర్ ఆసుపత్రి తదితర ప్రాంతాల్లో పేదలకు భోజనం అందించారు.
1500 మంది ఆకలి తీరుస్తున్నారు..
ప్రభుత్వాసుపత్రులకు వచ్చే రోగులు, వారి బంధువులకు కేసీఆర్ సేవాసమితి, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంయుక్తంగా ఆహారం అందించి ఆలంబనగా నిలిచారు. హైదరాబాద్‌లోని ఐదు ప్రధానాసుపత్రుల్లో సుమారు 15 వందల మందికి కడుపు నింపుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. నగరంలోని గోషామహల్ నియోజకవర్గం తెరాస నేత మహేందర్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య సిబ్బంది, ఉపాధి కోల్పోయిన కూలీలకు అల్పాహారం పంపిణీ చేశారు.
పక్కాగా లాక్‌డౌన్ అమలు కోసం అహర్నిశలు శ్రమిస్తున్న పోలీసు సిబ్బందికి వికారాబాద్ మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ రమేశ్ గ్లూకోజ్ ద్రావకాలను అందించారు. ఖమ్మం రైల్వేస్టేషన్ సమీపంలో ఆకలితో అలమటిస్తున్న అభాగ్యులకు ఓ యువకుడు స్వచ్ఛందంగా కదిలివచ్చి అల్పాహారం పంపిణీ చేశారు.
కుమురంభీం జిల్లా సిర్పూర్ MLA కోనేరు కోనప్ప కాగజ్ నగర్ ప్రభుత్వాసుపత్రికి కోనేరు ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా 15 ఆక్సిజన్ సిలిండర్లు అందజేశారు. మంథని నియోజవకర్గంలో సత్వర కొవిడ్ వైద్య సేవలందించేందుకు వీలుగా పుట్ట లింగమ్మ ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో అంబులెన్స్‌లను జడ్పీ ఛైర్మన్ పుట్టమధు ప్రారంభించారు. అత్యవసర సమయంలో రోగుల అవసరార్థం వాహనంలోనే ప్రాణవాయువును సమకూర్చినట్లు ఆయన తెలిపారు.