బ్లూ హైదరాబాద్ పేరిట భూగర్భ జలాల పరిరక్షణకు కృషి చేస్తూనే సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటున్నారు కల్పనా రమేశ్. లాక్‌డాన్ వేళ గచ్చిబౌలి, మాదాపూర్ తదితర ప్రాంతాల్లోని బాలింతలు, చిన్నారులు, గర్భిణులను గుర్తించి.. 20 రోజులుగా రోజూ 1700-1800 లీటర్ల వరకూ పాలను ప్యాకెట్ల రూపంలో పంపిణీ చేస్తున్నామని కల్పనా రమేశ్ చెప్పారు.
వలస జీవుల కష్టాలు తీరుస్తూ...
ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని విస్తృత ప్రచారం చేసే దోసపాటి రాము... లాక్‌డౌన్‌లోనూ సామాజికసేవలో పాలుపంచుకుంటున్నారు. తన భవిష్య నిధి(ప్రావిడెంట్ ఫండ్) నుంచి రూ.3 లక్షలు తీసి.. వలస కూలీలకు స్వయంగా నిత్యావసర సరకులను అందజేస్తున్నారు. ఎల్‌బీనగర్, వనస్థలిపురం, కొత్తపేట తదితర ప్రాంతాల్లో వలస జీవుల కుటుంబాలకు సరకులు పంపిణీ చేస్తున్నారు.
వందలాది మందికి భోజనం పెడుతూ...
చెరువుల రక్షణకు శ్రమించే మధులిక చౌదరి... లాక్‌డౌన్ వేళ వలస కూలీల ఆకలి తీర్చే అమ్మగా మారారు. సొంత ఖర్చుతో రోజూ వందలాది మందికి భోజనం పెడుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు 300 మంది వాలంటీర్లతో నగరవ్యాప్తంగా కాగితంతో తయారు చేసిన సంచులను పంపిణీ చేస్తున్నారు.