పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అరెస్ట్ చేయాలని.. లేకపోతే ఈ వ్యవహారంలో జాతీయ ఎస్సీ కమిషన్ జోక్యం చేసుకోవాల్సి వస్తుందని ఆ కమిషన్ సభ్యుడు రాములు హెచ్చరించారు. ధర్మారెడ్డిని పదవీ నుంచి బర్తరఫ్ చేసి, అరెస్ట్ చేయాలంటూ.. ట్యాంక్ బండ్ అంబేడ్కర్ విగ్రహం ముందు ఆల్ ఇండియా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ ఆర్గనైజేషన్ చేపట్టిన ఆందోళనకు ఆయన మద్దతు తెలిపారు.
తాత్సారం చేయడం సరికాదు..
రాష్ట్రంలో రాజ్యాంగం అమలు కావడం లేదంటూ రాములు ఆరోపించారు. బలహీన వర్గాల ఉద్యోగులపై తెరాస ఎమ్మెల్యే ఈ విధంగా మాట్లాడితే కేసీఆర్, కేటీఆర్ స్పందించకపోవడం దారుణమన్నారు. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం ద్వారానే ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం వచ్చినా విషయాన్ని చల్లా ధర్మారెడ్డి విస్మరించడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర ఎస్సీ కమిషన్ ఈ విషయం సుమోటోగా స్వీకరించకుండా తాత్సారం చేయడం సరికాదన్నారు.
'పరకాల ఎమ్మెల్యేను వారం రోజుల్లోగా బర్తరఫ్ చేసి అరెస్ట్ చేయాలి లేనిపక్షంలో ఈ నెల 14న 10 వేల మంది ఉద్యోగులతో కలిసి ఎమ్మెల్యే ఇంటిని దిగ్బంధం చేస్తాం.'
---మహేష్, ఆల్ ఇండియా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఎస్సీ , ఎస్టీ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షుడు
ఇదీ చదవండి: కేంద్రం నుంచి ఎలాంటి సాయం అందడం లేదు: మంత్రి ఎర్రబెల్లి