National Political Leaders Election Tours in Telangana : తెలంగాణ శాసనసభ ఎన్నికల దంగల్ ఆఖరి ఘట్టానికి చేరుకుంది. ఇంకో ఐదు రోజుల సమయమే ఉండడంతో అన్ని పార్టీలు తమ ప్రచారాలలో జోరు(Telangana Election 2023) పెంచాయి. మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్ పూర్తి కావడంతో.. వరుసపెట్టి జాతీయస్థాయి ఫేమస్ నేతలు తెలంగాణ యుద్ధానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో బీజేపీ, కాంగ్రెస్, సీపీఐ(ఎం) నేతలు రాష్ట్రానికి రానున్నారు. ముఖ్యంగా ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, రాజ్‌నాథ్ సింగ్.. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, డీకే శివకుమార్.. సీపీఐ(ఎం) అగ్రనేతలు మాణిక్ సర్కార్, సుభాషినీ ఆలీ వంటి ప్రముఖులు పాల్గొననున్నారు.
ప్రధాని మోదీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 నుంచి 27 వరకు రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మొత్తం ఆరు సభలు, హైదరాబాద్‌లో రోడ్ షోలలో పాల్గొననున్నారు. మొదటగా 25వ తేదీన కామారెడ్డి సభలో ప్రసంగించి.. అనంతరం రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం సభల్లో పాల్గొని ప్రసంగించనున్నారు. 26వ తేదీన కన్హ శాంతి వనంలో కార్యక్రమం, తూఫ్రాన్, నిర్మల్‌లో జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారు. 27వ తేదీన మహబూబాబాద్, కరీంనగర్‌లలో జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగే రోడ్‌షోలో పాల్గొననున్నారు.
అమిత్ షా : కేంద్రమంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు 24వ తేదీన రాష్ట్రానికి రానున్నారు. ఆరోజు ఆర్మూర్, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, అంబర్‌పేట అసెంబ్లీ నియోజకవర్గాల్లో రోడ్‌షోలు నిర్వహిస్తారు. అనంతరం మళ్లీ దిల్లీ వెళ్లి 26, 27, 28 ఈ మూడు రోజుల పాటు ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్నారు.
రాజ్‌నాథ్ సింగ్ : కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ 24న రాష్ట్రానికి రానున్నారు. ఆ రోజు ఉదయం 11 గంటలకు మేడ్చల్, సాయంత్రం 4 గంటలకు కార్వాన్, సాయంత్రం 5 గంటలకు కటోన్మెంట్ నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభల్లో పాల్గొననున్నారు.
ప్రియాంక గాంధీ : కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ నవంబరు 24, 25న తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నట్లు పీసీసీ వర్గాలు తెలిపాయి. నవంబరు 24న పాలకుర్తి, హుస్నాబాద్, కొత్తగూడెం కాంగ్రెస్ ప్రచార సభల్లో ప్రియాంక గాంధీ పాల్గొనున్నారు. కొత్తగూడెంలో సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావుకు మద్దతుగా ఆమె ప్రచారం చేయనున్నారు. నవంబరు 25వ తేదీన పాలేరు, సత్తుపల్లి, మధిర నియోజకవర్గాల్లో ప్రచార సభలలో ప్రియాంక పాల్గొని ప్రసంగించనున్నారు.
శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం- 33 జిల్లాల్లో 49 కేంద్రాలు ఖరారు
డీకే శివకుమార్ : కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ రెండు రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్నారు. నవంబరు 24, 25 తేదీల్లో ప్రచార సభల్లో పాల్గొననున్నారు. నవంబరు 24న స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో కార్నర్ మీటింగ్.. అక్కడి నుంచి వర్ధన్నపేట, వరంగల్ వెస్ట్ నియోజకవర్గాల్లో ప్రచార సభల్లో పాల్గొంటారు. అదే రోజు రాత్రి అంబర్ పేట నియోజకవర్గంలో కార్నర్ మీటింగ్‌లో డీకే శివకుమార్ పాల్గొననున్నారు. మరుసటి రోజు నవంబరు 25న హైదరాబాద్‌లోని పలు నియోజకవర్గాల్లో రోడ్‌షోలు, కార్నర్ సమావేశాల్లో పాల్గొని ప్రసంగించనున్నారు.
మాణిక్ సర్కార్ : సీపీఐ(ఎం) పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యులు, త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ మూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. నవంబరు 24న ఖమ్మం రోడ్ షో, మధిర నియోజకవర్గం ముదిగొండలో సభ నిర్వహించనున్నారు. అలాగే నవంబరు 25న భద్రాచలం నియోజకవర్గంలోని వాజేడులో ఎన్నికల సభ.. సాయంత్రం భద్రాచలంలో రోడ్‌షోలో పాల్గొననున్నారు. నవంబరు 26న పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచిలో జరిగే ఎన్నికల ప్రచార సభ పాల్గొని ప్రసంగించనున్నారు.
సుభాషినీ ఆలీ : సీపీఐ(ఎం) పార్టీ పాలిట్ బ్యూరో సభ్యురాలు సుభాషినీ ఆలీ నవంబరు 24వ తేదీన ఉదయం జనగాం నియోజకవర్గంలో పర్యటించి.. సాయంత్రం హైదరాబాద్‌లోని ముషిరాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల పర్యటన చేయనున్నారు.
బాబ్బాబు ఒక్కసారి ఊరొచ్చి నాకు ఓటేసిపో - రానుపోను ఖర్చులన్నీ నావే
చివరి వారమంతా తెలంగాణలోనే అగ్రనేతలు - ఆఖరి ఘట్టంలో ప్రచారాన్ని హోరెత్తించనున్న ప్రధాన పార్టీలు