National Medical Commission: ఎంబీబీఎస్ విద్యార్థులు తుది సంవత్సరంలో ఇక థియరీ పరీక్షలు రాయనక్కర్లేదు. వాటికి బదులు రెండుసార్లు ప్రాక్టికల్ పరీక్షలకు హాజరవ్వాల్సి వస్తుంది. ‘నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ (నెక్స్ట్)’ పేరిట జాతీయ వైద్య కమిషన్ ప్రవేశపెడుతున్న నూతన విధానంలో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. నెక్స్ట్‌లో స్టెప్ 1, 2 అనే రెండు రకాల పరీక్షలుంటాయి. తుది సంవత్సరం ఎంబీబీఎస్ విద్యార్థులు ఈ రెండు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తేనే.. పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు, వైద్యులుగా ప్రాక్టీసుకు అర్హత లభిస్తుంది.
ఇక నీట్ పీజీ పరీక్ష ఉండదు. దీని స్థానంలో ఈ రెండు పరీక్షలనే ప్రామాణికంగా తీసుకుంటారు. విదేశాల్లో వైద్యవిద్య పూర్తి చేసుకున్న విద్యార్థులు భారత్‌లో పీజీ చదవాలన్నా, ప్రాక్టీసు చేయాలన్నా.. ప్రస్తుతం మరో అర్హత పరీక్షను రాస్తున్నారు. ఇకపై వారు కూడా నెక్స్ట్‌లో ఉత్తీర్ణత సాధించాలి. ఈ మేరకు మార్పులతో జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) గురువారం నెక్స్ట్‌పై ముసాయిదా ప్రకటనను విడుదల చేసింది.
దీనిపై అభ్యంతరాలు, సలహాలు, సూచనలు తెలపాలనుకుంటే.. ఐడీకి 30 రోజుల్లోగా ఈ-మెయిల్ పంపించాలని కోరింది. గెజిట్ ప్రకటన వెలువడిన సంవత్సరం నుంచి ‘నెక్స్ట్’ అమల్లోకి వస్తుందని పేర్కొంది. అంటే ఇది అమల్లోకి వచ్చే నాటికి తుది సంవత్సరం ఎంబీబీఎస్ చదివే వారికి ఇది వర్తిస్తుంది.
- తొలిదశ పరీక్షల్లో కనీసం 50 శాతం మార్కులు
* ఎంబీబీఎస్ తుది సంవత్సరం విద్యార్థులు థియరీకి బదులు విశ్వవిద్యాలయాలు నిర్వహించే ప్రాక్టికల్స్/క్లినికల్ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. వీటితో పాటు నెక్స్ట్ తొలిదశ పరీక్షను రాయాలి. ఇందులో అన్నీ బహుళ ఐచ్ఛిక (మల్టిపుల్ ఛాయిస్) ప్రశ్నలే ఉంటాయి.
* మెడిసిన్, ఇతర అనుబంధ స్పెషాలిటీలు, సర్జరీ ఇతర అనుబంధ స్పెషాలిటీలు, అబ్‌స్ట్రిక్స్ అండ్ గైనకాలజీ, పీడియాట్రిక్స్, ఈఎన్‌టీ, ఆఫ్తల్మాలజీ విభాగాలతో పాటు ఎంబీబీఎస్ తొలి ఏడాది, రెండో ఏడాదిలో వచ్చే అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, పాథాలజీ, మైక్రోబయాలజీ తదితర విభాగాల నుంచి కూడా ప్రశ్నలుంటాయి.
* ప్రధానంగా సబ్జెక్టును ఒక కథలా చెప్పి దాని నుంచి ప్రశ్నలు అడుగుతారు. కంప్యూటర్‌పై పరీక్షలు నిర్వహిస్తారు.
* ప్రశ్నపత్రాల్లో ప్రాబ్లం సాల్వింగ్ ప్రశ్నలే 65 శాతం ఉంటాయి. కొంచెం కఠినమైనవి 25 శాతం. మరీ కఠినమైనవి 10 శాతం ఉంటాయి.
* ప్రతి పేపర్‌లోనూ ప్రజారోగ్యానికి సంబంధించిన ప్రశ్నలు 10 శాతం ఉంటాయి. స్టెప్ 1లో వచ్చిన మార్కులను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో అర్హతకు, ఉపకార వేతనాలకు ప్రామాణికంగా పరిగణిస్తారు. స్టెప్ 1లోని ప్రతి సబ్జెక్టులోనూ కనీసం 50 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఈ మార్కులను పీజీ ప్రవేశాలకు అర్హతగా పరిగణిస్తారు.
- రెండుసార్లు ప్రాక్టికల్ పరీక్షలు
* తొలిదశ పరీక్షలను ఎన్‌ఎంసీ, రెండోదశ పరీక్షలను రాష్ట్రాల్లోని ఆరోగ్య విశ్వవిద్యాలయాల ఆధ్వర్యంలో నిర్వహిస్తారు.
* పీజీలో ప్రవేశాలకు తొలిదశ పరీక్షల మార్కులనే పరిగణనలోకి తీసుకున్నా.. తప్పనిసరిగా స్టెప్ 2లో కూడా ఉత్తీర్ణత సాధించాలి. ఇందులో మార్కుల శాతం అంటూ ఏమీ ఉండదు.. పాసైతే చాలు.
* ఎంబీబీఎస్‌లో చేరిన 10 ఏళ్లలోపు స్టెప్ 1, స్టెప్ 2 పరీక్షల్లో ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది.
* రెండోదశ పరీక్షలు పూర్తిగా ప్రాక్టికల్స్. ఇందులో మెడిసిన్, సర్జరీ, అబ్‌స్ట్రిక్స్ అండ్ గైనకాలజీ, పీడియాట్రిక్స్, ఈఎన్‌టీ, ఆర్థోపెడిక్స్, ఫిజికల్ మెడిసిన్ అండ్ రిహాబిలిటేషన్ విభాగాల్లో ప్రాక్టికల్ పరీక్షలు ఉంటాయి.
* ఎంబీబీఎస్ తుది ఏడాది విద్యార్థులు రెగ్యులర్‌గా హాజరయ్యే ప్రాక్టికల్స్‌తో పాటు.. రెండోదశ పరీక్షలో భాగంగా నిర్వహించే ప్రాక్టికల్స్‌కూ హాజరవ్వాలి. అంటే రెండుసార్లు ప్రాక్టికల్స్ రాయాల్సి వస్తుంది. వీటిని విశ్వవిద్యాలయాల ఆధ్వర్యంలోనే నిర్వహిస్తారు.
* నెక్స్ట్‌లో వచ్చిన మార్కులు మూడేళ్లవరకు వర్తిస్తాయి. స్టెప్ 1, స్టెప్ 2 పరీక్షలను వార్షిక, సప్లిమెంటరీ విధానాల్లో నిర్వహిస్తారు.
* స్టెప్ 1 రెగ్యులర్ పరీక్షలో ఫెయిల్ అయినా.. ఎన్నిసార్లయినా సప్లిమెంటరీ రాసుకోవచ్చు. అయితే ఎంబీబీఎస్‌లో చేరినప్పటి నుంచి పదేళ్ల లోపు ఉత్తీర్ణులవ్వాలి.
* రెండోదశ పరీక్షలోని ఏడు పేపర్లలో 3 అంతకంటే ఎక్కువ సబ్జెక్టుల్లో ఫెయిల్ అయితే.. సప్లిమెంటరీ రాసుకోవడానికి అర్హత లభించదు.
* స్టెప్ 1లో ఉత్తీర్ణత సాధిస్తే చాలు.. ఏడాది పాటు ఇంటర్న్‌షిప్ చేయొచ్చు. ఇంటర్న్‌షిప్‌లో చేరిన ఏడాది తర్వాత స్టెప్ 2లో ప్రాక్టికల్స్ ఉంటాయి.
ఇవీ చదవండి: