National level hand loom exhibition in hyderabad: జాతీయ చేనేత దినోత్సవం రాష్ట్రంలో ఘనంగా జరగనుంది. ప్రతి సంవత్సరం తరహాలో హైదరాబాద్‌లో చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యంలో చేనేత కళాకారులను ఘనంగా ప్రభుత్వం సత్కరించనుంది. హైదరాబాద్ నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్‌ప్లాజాలో జాతీయ చేనేత దినోత్సవం కార్యక్రమం ఐటీ, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా వారం రోజుల పాటు జరగనున్న జాతీయ స్థాయి చేనేత ప్రదర్శనను మంత్రి ప్రారంభించనున్నారు.
ఈ ప్రదర్శనలో తెలంగాణ సహా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి చేనేత కార్మికులు, సహకార సంఘాల ఆధ్వర్యంలో స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. చేనేత కళాకారులు తయారు చేసిన పోచంపల్లి ఇక్కత్, గద్వాల కాటన్, సిల్క్, సికో జరీ చీరలు, నారాయణపేట కాటన్ నమూనాలు, పట్టు చీరలు, వరంగల్ డర్రీలు, కరీంనగర్ బెడ్ షీట్లు ప్రదర్శనలో విక్రయించేందుకు అందుబాటులో ఉంచనున్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ పేరిట ఇచ్చే పురస్కారాలు 28 మంది ఉత్తమ చేనేత కళాకారులకు మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రదానం చేయనున్నారు. ప్రతి పురస్కార గ్రహీతకు ఒక ప్రతిభా పత్రం, జ్ఞాపిక, శాలువాతో పాటు రూ.25 వేల నగదు అందజేయనున్నారు.
ఇవీ చూడండి..
చీరపై 'నేతన్నకు బీమా పథకం'.. చేనేత కార్మికుడి మగ్గంపై అరుదైన కళాఖండం
దేశంలో స్వల్పంగా తగ్గిన కొవిడ్ కేసులు.. జపాన్, దక్షిణ కొరియాలో మాత్రం..