Dissatisfaction With Appointment of BJP Polling Booth Committees: బూత్ సశక్తి కరణ్ అభియాన్‌పై బీజేపీ జాతీయ సంస్థాగత సహా ప్రధాన కార్యదర్శి శివ ప్రకాశ్ సమీక్ష చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సుదీర్ఘంగా సాగిన సమావేశంలో బండి సంజయ్, తరుణ్ చుగ్, అరవింద్ మీనన్ పాల్గొన్నారు. ఉమ్మడి పది జిల్లాల వారీగా సమీక్ష ప్రారంభించారు. రెండు జిల్లాల నివేదకను పరిశీలించిన శివ ప్రకాశ్‌తో పాటు తరుణ్ చుగ్, అరవింద్ మీనన్ బూత్ కమిటీల నియామకం నత్త నడకన జరుగుతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
BJP Polling Booth Committees: 25 శాతం కూడా బూత్ కమిటీలు పూర్తి కాకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బూత్ కమిటీలు బాధ్యులపై సీరియస్ అయ్యారు. పని తీరు మీదే రాజకీయ భవిష్యత్ ఉంటుందని హెచ్చరించారు. కర్ణాటక ఎన్నికల్లో ఏ సర్వే ఏమీ చెప్పినా.. విజయం సాధించేది బీజేపీ మాత్రమేనని స్పష్టం చేశారు. కర్ణాటకలో గెలుస్తామని చెప్పడానికి కారణం బూత్ కమిటీలు ఆ రాష్ట్రంలో పటిష్ఠంగా ఉండడమేనని తెలిపారు.
బూత్ కమిటీలు వేసి తీరాల్సిందే: తెలంగాణలోనూ బీజేపీ అధికారంలోకి రావాలంటే పోలింగ్ బూత్ కమిటీలను 100 శాతం పూర్తి చేసి పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ఇచ్చిన ఫార్మాట్ ప్రకారం.. బూత్ కమిటీలు వేసి తీరాల్సిందేనని శివప్రకాశ్ ఆదేశించారు. ఈ నెల 30న ప్రధాన మంత్రి మన్ కీ బాత్లోపు బూత్ కమిటీలు వేయడం పూర్తి కావాలన్నారు. ఈ నెల 25లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి పోలింగ్ బూత్‌లో 11 మందితో కమిటీ వేయాలని.. పటిష్ఠమైన పోలింగ్ బూత్ కావాలి అంటే 31 మందితో వేయాలని సూచించారు.
బూత్ కమిటీలలో నాలుగు అంశాలు పాటించాలి: 11 మంది బూత్ కమిటీ సభ్యుల్లో అధ్యక్ష, కార్యదర్శితో పాటు వాట్సాఫ్, యువ, మహిళా బాధ్యతలను కట్టబెట్టాలని సూచించినట్లు తెలుస్తోంది. బూత్ కమిటీలలో నాలుగు అంశాలు పాటించాలన్నారు. జాబితా తయారు చేయడం.. వారికి బాధ్యతలు అప్పగించడం.. వారందరితో కలిపి ఫొటో తీసుకోవాలని చెప్పినట్లు తెలుస్తోంది. దాన్ని అప్లోడ్ చేయడంతో పాటు బూత్ కమిటీ సభ్యుల మొబైల్ నుంచి మిస్డ్ కాల్ ఇవ్వాలని చెప్పినట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి.
వారందరితో సరల్ యాప్ డౌన్ లోడ్ చేయించాలని చెప్పినట్లు సమాచారం. బూత్ కమిటీలు వేయడంపై బీజేపీ నేతలు చుక్కలు చూస్తున్నారు. బూత్ స్థాయిలో ఒకరిద్దరు కూడా దొరకని స్థితిలో 20-30 మందితో కమిటీ వేయడం ఎలా సాధ్యమని రాష్ట్ర నేతలు నిర్ఘాంత పోతున్నారు. బూత్ కమిటీల నియామకం రాష్ట్ర నేతలకు తలకు మించిన భారంగా మారితే.. దిల్లీ పెద్దలు మాత్రం కమిటీలు వేసి తీరాల్సిందేనని ఆదేశించినట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.
ఇవీ చదవండి: