రాష్ట్రంలో హ్యాండ్బాల్ క్రీడాభివృద్ధికి ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తానని క్రీడా, పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జాతీయ హ్యాండ్బాల్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన అలవెనపల్లి జగన్ మోహన్రావు మర్యాదపూర్వకంగా మంత్రిని కలిశారు. రాష్ట్రంలో క్రీడారంగానికి ఆయన చేసిన సేవలను మంత్రి కొనియాడారు.
తెలంగాణ నుంచి జాతీయ క్రీడాసంఘానికి అధ్యక్షత వహించిన ఘనత జగన్ మోహన్రావుకే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో క్రీడా ప్రాంగణాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలున్నాయని మంత్రి తెలిపారు. హైదరాబాద్లో అంతర్జాతీయ హ్యాండ్బాల్ టోర్నమెంట్ నిర్వహించేందుకు రాష్ట్ర క్రీడాశాఖ తరఫున కృషి చేస్తామన్నారు.
టీస్పోర్ట్స్ హబ్ పేరిట అకాడమీని నెలకొల్పి వర్ధమాన క్రీడాకారులు ఒలింపిక్స్, అంతర్జాతీయ క్రీడా వేదికలపై పతకాల గెలుపే లక్ష్యంగా తయారు చేయాలన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో దేశానికి ఆదర్శంగా నిలిచేలా అత్యుత్తమ క్రీడ పాలసీని రాష్ట్రంలో ప్రవేశపెడుతున్నామని వెల్లడించారు. మంత్రిని కలిసిన వారిలో తాండూరు శాసనసభ్యులు పైలెట్ రోహిత్ రెడ్డి, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి, ఇండియన్ హాకీ మాజీ క్రీడాకారుడు చంద్రశేఖర్, రఘునందన్ రెడ్డి ఉన్నారు.