National Farmers Round Table: జాతీయ రైతు సదస్సుకు తెలంగాణ రాష్ట్ర పసుపు రైతు సంఘం వ్యవస్థాపకుడు కోటపాటి నరసింహనాయుడుకు ఆహ్వానం లభించింది. ఈ నెల 19, 20 తేదీల్లో రెండు రోజులపాటు బెంగళూరు జీకేవీకే విశ్వవిద్యాలయం ప్రాంగణంలో భారత పసుపు రైతుల సమాఖ్య, కర్ణాటక చెరుకు రైతు సంఘం సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ రౌండ్ టేబుల్ సమావేశం జరగనుంది. కర్ణాటక రైతు నేత కె.శాంతకుమార్ అధ్యక్షతన జరగనున్న ఈ సదస్సుకు పది రాష్ట్రాల నుంచి రైతు నాయకులు హాజరుకానున్నారు.
తెలంగాణ పథకాలపై చర్చ
కర్ణాటకలో రైతులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలతో పాటు వివిధ రాష్ట్రాల రైతు సమస్యలపై విస్తృతంగా చర్చించి భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ ప్రకటించనున్నారు. ఇదే సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం రైతులకు అందజేస్తున్న రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలు, పెద్ద ఎత్తున సాగు నీటి వనరుల కల్పన, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు సరఫరా వంటి వివిధ రకాల ప్రోత్సాహకాలపై సమావేశంలో చర్చించనున్నారు. అనంతరం కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మైని కలిసి తెలంగాణ ఆదర్శ పథకాలు కర్ణాటకలో కూడా అమలు చేయాలని కోరనున్నారు.
రైతు వ్యతిరేక విధానాల ప్రస్తావన
ఈ సమావేశానికి రాష్ట్రం నుంచి కోటపాటి నరసింహం నాయుడు, ఖమ్మం జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ నుంచి యేర్నేని నాగేంద్రనాథ్, దశరథరామిరెడ్డి, తమిళనాడు నుంచి దైవశిఖామణి, మహారాష్ట్ర నుంచి వినయక్‌రావు పాటేల్, ఉత్తరప్రదేశ్ నుంచి హర్‌పాల్‌సింగ్, కేరళ నుంచి కేఎస్ బిజూ తదితర నేతలు పాల్గొనున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న రైతు వ్యతిరేక విధానాలతోపాటు తెలంగాణ సాధిస్తున్న విజయాలు ఈ సదస్సు వేదికగా ప్రస్తావించనున్నామని నరసింహనాయుడు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: 'సమస్యలు పరిష్కరించే వరకు కదలం.. హోలీ పండుగ ఇక్కడే చేసుకుంటం'