లక్ష్మీనరసింహస్వామికి నాలుక ఎక్కడైనా బయటికే ఉంటుందని యాదాద్రి ఆలయ ప్రధానార్చకులు నరసింహాచార్యులు పేర్కొన్నారు. , స్వామివారు పూర్తి శాంతమూర్తేనని తెలిపారు. విగ్రహంపై ఏళ్ల తరబడి పేరుకుపోయిన సింధూరాన్ని తామే స్వయంగా తొలిగించామని, స్వామివారిని వేరేవారు తాకే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.
ఆలయ నిర్మాణానికి సంబంధించి తమకు ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. పూర్తిగా ఆగమశాస్త్రానికి అనుగుణంగా, శాస్త్రోక్తంగానే ఆలయ నిర్మాణం జరుగుతోందని తెలిపారు. ప్రధానార్చకులు చినజీయర్ స్వామి చెప్పినట్లే నడుచుకుంటామని అన్నారు. గతంలో ఎప్పుడూ ఆలయ అభివృద్ధి గురించి పట్టించుకోలేదని... ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ బృహత్తర స్థాయిలో అభివృద్ధి చేస్తున్నారని ప్రధానార్చకులు నరసింహాచార్యులు కొనియాడారు.
ఎవరికి పడితే వారికి అనుమతి ఉండదు
గర్భగుడిలోకి ఎవరికి పడితే వారికి అనుమతి ఉండదని ఆలయ కార్యనిర్వాహణాధికారి గీతారెడ్డి స్పష్టం చేశారు. జనవరి నెలాఖరు వరకు ప్రధాన ఆలయం పనులన్నీ పూర్తవుతాయని చెప్పారు. స్వయంభూ మూలవిరాట్టును యథాతథంగా ఉంచుతున్నామని... నమూనా ప్రకారం మెట్లు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. వృద్ధులు, ఇతరుల కోసం లిఫ్ట్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ఈఓ తెలిపారు.
ఎన్నో ప్రశంసలు..
వెయ్యి ఏళ్ల తర్వాత కేవలం రాతితోనే గొప్ప ఆలయ నిర్మాణం జరుగుతోందని, ఎన్నో ప్రశంసలు లభిస్తున్నాయని యాదాద్రి ఆలయ అభివృద్ధి సంస్థ ఉపాధ్యక్షులు కిషన్ రావు తెలిపారు. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకునే ఆలయాన్ని నిర్మిస్తున్నామన్నారు. ఎక్కడా అపోహలకు తావు లేదని ఆయన స్పష్టం చేశారు. పెద్దగుట్టపైన 250 ఎకరాల స్థలాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశామని, దాతలచే కాటేజీల నిర్మాణానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.
ఇదీ చూడండి : 'లక్ష్మీ నరసింహస్వామిని ఉలితో చెక్కడం దారుణం'