తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఉపాధ్యక్షుడు నల్లమాస కృష్ణను జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించడం వల్ల కృష్ణను చర్లపల్లి కేంద్ర కారాగారానికి తీసుకెళ్లారు. మావోయిస్టులకు సహకరిస్తున్నారనే ఆరోపణలపై గతేడాది అక్టోబర్లో నల్లకుంట పోలీస్ స్టేషన్లో కృష్ణపై కేసు నమోదైంది. ఆ కేసుపై జైలుకెళ్లిన కృష్ణ ఇటీవలే బెయిల్పై విడుదలై బయటకు వచ్చారు.
జాతీయ దర్యాప్తు సంస్థ అతనిపై కేసు నమోదు చేసింది. ఆ కేసులో పలు ఆధారాలు సేకరించిన అధికారులు కృష్ణను ఖమ్మంలో అరెస్టు చేసి హైదరాబాద్కు తీసుకొచ్చారు. వెన్నునొప్పితో బాధపడుతున్న అతనికి ఆసుపత్రిలో చికిత్స అందించి న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. కృష్ణపై అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులు పెడుతున్నారని అతని భార్య ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడిన ఆయనను ప్రభుత్వం ఆదుకోవాలని భార్య విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి : ఇంటర్ ఫెయిలైందని విద్యార్థిని ఆత్మహత్య