నాబార్డు ఛైర్మన్‌గా పనిచేస్తున్న తెలుగు వ్యక్తి డాక్టర్ గోవిందరాజులు చింతల ఆప్రాకా ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. రెండేళ్లపాటు పదవిలో ఉంటారు. ఈ సంఘాన్ని 1977లో భారత్ సహా 16 దేశాల అత్యున్నత గ్రామీణ, వ్యవసాయాభివృద్ధి బ్యాంకులు కలసి ఏర్పాటుచేశాయి. ప్రస్తుతం చైనా, జపాన్, వియత్నాం తదితర 24 దేశాలు ఇందులో సభ్యత్వం కలిగి ఉన్నాయి. మనదేశంలో గ్రామీణ, వ్యవసాయాభివృద్ధి రంగాలకు అత్యున్నత బ్యాంకుగా నాబార్డు పనిచేస్తోంది. ఇలాగే 24 దేశాల్లోని అత్యున్నత బ్యాంకుల ఛైర్మన్ల నుంచి ఆప్రాకా ఛైర్మన్‌ను ఎన్నుకుంటారు. దీనికి ఈసారి చింతల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
చైనా అత్యున్నత బ్యాంకు ప్రతినిధి ఆప్రాకా ఉపాధ్యక్షుడి హోదాలో చింతలకు సహాయకారిగా పనిచేస్తారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల కూటములకు ప్రాంతీయస్థాయిలో ఆప్రాకా తరహా సంఘాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా గ్రామీణ, వ్యవసాయాభివృద్ధి రంగాలకు రుణ పంపిణీ విధానాలపై కొత్త ఆలోచనలను పంచుకోవడానికి, అమలులో ఆయా దేశాలకు సిఫార్సులు చేయడానికి ఆప్రాకా కృషి చేస్తుంది. ఇంతకు ముందు ఒక భారతీయుడికి ఈ పదవి దక్కింది. ఆప్రాకా ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ముంబయిలోని నాబార్డు ప్రధాన కార్యాలయం నుంచి చింతల ఆన్‌లైన్‌లో మాట్లాడారు.
ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులతో సవాళ్లు పెరుగుతున్నాయని, చిన్న కమతాల రైతులను వీటి నుంచి రక్షించేందుకు ఏం చేయాలనే దానిపై ఆప్రాకా దృష్టి పెడుతుందన్నారు. పేద రైతుల పరిరక్షణకు నూతన ప్రణాళికలు అవసరమని, వాటి రూపకల్పనకు కృషి చేస్తానన్నారు. ఇందుకోసం వివిధ దేశాల మధ్య ఆలోచనలను పంచుకోవడం, కొత్త ప్రాజెక్టుల అమలు, పరస్పర సహకారం అందించడానికి పనిచేస్తానన్నారు.
ఇదీ చూడండి: విమర్శలు, హామీలతో వాడివేడిగా ఎమ్మెల్సీ ప్రచారం