ప్రపంచ విత్తన కేంద్రంగా తెలంగాణను మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 58.33 లక్షల రైతులకు 1.43 కోట్ల ఎకరాల సాగు భూమి ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించిందన్నారు. వారందరికి రైతుబంధు పథకం అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రతిష్ఠాత్మక ఇస్టా 32వ సదస్సు తొలిసారి ఆసియాలో, తెలంగాణలో నిర్వహించడం వల్ల రాష్ట్ర ప్రతిష్ఠ మరింత పెరిగిందన్నారు. బేగంపేటలోని సెస్‌లో జరిగిన నాబార్డు 38వ ఫౌండేషన్ డే కార్యక్రమంలో మంత్రి నిరంజన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో రిజర్వ్ బ్యాంక్ ప్రాంతీయ సంచాలకులు సుబ్రతాదాస్, ఆంధ్రబ్యాంక్ ఎండీ ఫకీర్ స్వామి, నాబార్డు మాజీ ఛైర్మన్ కోటయ్య, ఏపీ నాబార్డ్ సీజీఎం సెల్వరాజ్, నాబార్డు తెలంగాణ సీజీఎం విజయ్‌కుమార్ పాల్గొన్నారు.
మిషన్ భగీరథ్‌కు రూ.4800కోట్లు, కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.1500 కోట్లు ఇచ్చినందుకు నాబార్డుకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. రైతులు, ప్రభుత్వం, బ్యాంకును అనుసంధానం చేసే సంస్థ నాబార్డు అని తద్వారా వ్యవసాయ రంగానికి నాబార్డు సేవలు ప్రశంసనీయమని కొనియాడారు.
ఇదీ చూడండి : నిబంధనలు అతిక్రమిస్తే తప్పదు భారీ మూల్యం