Mynampally Confirms Congress Joining : కాంగ్రెస్‌లోకి మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు చేరిక ఖరారయ్యింది. ఈ నెల 27 లోపు దిల్లీ పెద్దల సమక్షంలో పార్టీలో చేరునున్నట్లు మైనంపల్లి స్పష్టం చేశారు. దూలపల్లిలోని తన నివాసంలో.. కాంగ్రెస్ నేతలు భట్టి విక్రమార్క, మధు యాస్కీ, దామోదర రాజనరసింహ, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్‌తో సమావేశమైన అనంతరం ప్రకటించారు. నియోజకవర్గంలో చేసిన సర్వే రిపోర్టుల ఆధారంగా తనకు, తన కుమారుడికి.. ఇద్దరికి కూడా అవకాశం ఇస్తారని భావిస్తున్నామన్నారు. మైనంపల్లి నివాసానికి రాజనరసింహ, అంజన్ కుమార్ యాదవ్ ముందు రాగా.. 2 గంటల తరువాత భట్టి, మధు యాష్కీ వచ్చారు.
Mynampally Latest News : మల్కాజిగిరి, మెదక్, మేడ్చల్ స్థానాలు ఆశిస్తున్నట్లు మైనంపల్లి పేర్కొన్నారు. మేడ్చల్ ఎమ్మెల్యే సీటు నక్క ప్రభాకర్ గౌడ్‌కు ఇవ్వాలని ఆయన అభ్యర్థిస్తున్నారు. ఎవరెన్ని అవాంతరాలు సృష్టించినా కాంగ్రెస్ పార్టీలో త్వరలో చేరుతున్నట్లు.. నమ్ముకున్న నియోజకవర్గ ప్రజల కోసం కష్టపడతానని తెలిపారు. తమ కార్యకర్తలపై ఇప్పటి నుంచే కేసులు పెడుతున్నారని.. బీఅర్ఎస్పై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు.
T Congress Latest News : మరోవైపు మైనంపల్లి చేరిక వేళ మల్కాజిగిరి పార్టీ నేతల్లో అసమ్మతి తలెత్తకుండా.. కాంగ్రెస్ అప్రమత్త చర్యలు చేపట్టింది. ఓ వైపు మైనంపల్లితో చర్చలు జరుపుతున్న హస్తం నేతలు.. అదే సమయంలో మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్‌తో భేటీ అయ్యారు. రానున్న ఎన్నికల్లో ఇక్కడి నుంచే శ్రీధర్ పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. మైనంపల్లి రాకతో తనకు టికెట్‌పై సందిగ్ధత నెలకొన్న తరుణంలో.. కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ఆయన అసమ్మతికి గురికాకుండా ప్రయత్నాలు చేస్తోంది.
ఇందులో భాగంగానే అల్వాల్‌లోని నందికంటి శ్రీధర్ నివాసంలో పార్టీ నేతలు భేటీ అయ్యారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్, సీనియర్ నేత వి.హన్మంతరావుతో పాటు ఇతర నేతలు.. మైనంపల్లి చేరిక అంశం, నందికంటి టికెట్ గురించి చర్చించినట్లు తెలుస్తోంది. అధికారపార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి కొత్త వారిని ఆహ్వానించినప్పటికి.. పార్టీకి కట్టుబడి ఉన్న నాయకులను ఎట్టి పరిస్థితుల్లో విస్మరించేది లేదని కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ స్పష్టం చేశారు.
Telangana Congress Latest News : మరోవైపు మల్కాజిగిరి సీటుపై ఇంకా ఎలాంటి స్పష్టత లేదని.. ఎట్టి పరిస్థితుల్లో ఈ స్థానం నుంచే పోటీ చేయడం ఖాయమని జిల్లా డీసీసీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ పేర్కొన్నారు. ఈ నియోజకవర్గం నుంచి మైనంపల్లికి టికెట్ కేటాయించే అంశంపై పార్టీ ఇంకా నిర్ణయం తీసుకోలేదని.. కుటుంబానికి ఒకటే టికెట్ అనే ఉదయపూర్ డిక్లరేషన్ ఇక్కడ కూడా వర్తిస్తుందని అన్నారు.
"కాంగ్రెస్ నేతలు నన్ను పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్‌లోకి చేరాలని నిర్ణయించుకున్నాను. ఈ నెల 27 లోపు.. దిల్లీ పెద్దల సమక్షంలో కాంగ్రెస్‌లోకి చేరుతాను. నియోజకవర్గ సర్వే రిపోర్టుల ఆధారంగా.. నాకు, నా కుమారుడికి టికెట్ ఇస్తారని భావిస్తున్నాను". - మైనంపల్లి, మల్కాజిగిరి ఎమ్మెల్యే
MLA Mynampally Latest Comments : 'నన్ను ఇబ్బంది పెడితే.. రియాక్షన్ ఇలాగే ఉంటుంది'