Mynampally Hanumanth Rao Joined Congress Party in Delhi : ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే(AICC Chief Kharge) సమక్షంలో బీఆర్ఎస్ నాయకుడు, ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు(Mynanpally Hanumantha Rao) కాంగ్రెస్ పార్టీలో చేరారు. మైనంపల్లితో పాటు రోహిత్, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, కుంభం అనిల్ కుమార్ కూడా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. దిల్లీలోని ఖర్గే నివాసం 10 రాజాజీ మార్గ్‌లో పార్టీలో చేరికలు జరిగాయి. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంఛార్జ్ మాణిక్‌రావ్ ఠాక్రే, తదితరులు పాల్గొన్నారు.
మల్కాజిగిరి ఎమ్మెల్యే టికెట్ తనకు ఇచ్చినా.. మెదక్ టికెట్ తన కుమారుడు రోహిత్‌కు మైనంపల్లి బీఆర్ఎస్ అధినేతను అడిగారు. అందుకు సీఎం కేసీఆర్ ససేమిరా అనడంతో.. బీఆర్ఎస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి వ్యూహాలను సిద్ధం చేసుకున్నారు. తన అనుచరులతో కలసి వారం క్రితం గాంధీభవన్‌కు వెళ్లి రేవంత్ రెడ్డిని కలిశారు. ఇప్పుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
Mynampally Speech at Delhi : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని మైనంపల్లి హనుమంతరావు ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అనుకూలమైన వాతావరణ తెలంగాణలో ఉందని అన్నారు. సర్వేల ఆధారంగా అధిష్ఠానమే సీట్లను నిర్ణయిస్తుందని తెలిపారు. సర్వేల ఆధారంగానే మేం అభ్యర్థులుగా ఉండనున్నామన్నారు. బీఆర్ఎస్లో ఎంత చేయాలో.. అంత చేశానని.. కార్యకర్తలంతా తనతోనే ఉన్నారని పేర్కొన్నారు.
"తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది. కాంగ్రెస్‌కు అనుకూలమైన వాతావరణం ఉంది. సర్వేల ఆధారంగా అధిష్ఠానమే సీట్లను నిర్ణయిస్తుంది. సర్వేల ఆధారంగానే మేం అభ్యర్థులుగా ఉండనున్నాం. బీఆర్ఎస్లో ఎంత చేయాలో.. అంత చేశాను. కార్యకర్తలంతా నాతోనే ఉన్నారు." - మైనంపల్లి హనుమంతరావు, ఎమ్మెల్యే
Mynampally joined Congress Party in Presence of Mallikarjuna Kharge : బీఆర్ఎస్లో ఉన్నప్పుడు మొదటి నుంచి మల్కాజిగిరి, మెదక్ స్థానాలు కావాలని మైనంపల్లి ఆశించారు. కానీ మల్కాజిగిరి స్థానం మాత్రమే ఇచ్చి.. మెదక్ తన కుమారుడికి ఇవ్వలేదు. అప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ వచ్చారు. అలాగే తిరుమల దర్శనానికి వెళ్లి.. దర్శన అనంతరం మంత్రి హరీశ్‌రావుపై ధ్వజమెత్తారు. అప్పటి నుంచి బీఆర్ఎస్కు దూరంగా ఉంటూ వస్తున్న మైనంపల్లి.. కాంగ్రెస్ నేతలతో సంప్రదింపులు జరిపారు.
తన కుమారుడు రోహిత్‌కు మెదక్ టికెట్, తనకు మల్కాజిగిరి టికెట్లు ఇవ్వాలని కాంగ్రెస్ అధినాయకత్వాన్ని కోరారు. అందుకు కాంగ్రెస్ నుంచి ఎలాంటి సిగ్నల్ వచ్చిందో తెలియదు కానీ.. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. తనను నమ్ముకున్న నియోజకవర్గ ప్రజల కోసం కష్టపడతానని తెలిపారు. తమ కార్యకర్తలపై ఇప్పటి నుంచే కేసులు పెడుతున్నారని.. బీఆర్ఎస్ పార్టీపై మైనంపల్లి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈలోపు మైనంపల్లి కుటుంబంలో ఇద్దరికి టికెట్లు ఇవ్వాలని నిర్ణయించామని రేవంత్ రెడ్డి బుధవారం స్పష్టం చేశారు.
Congress Party Assembly Election Plan : మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ పార్టీలో చేరిన వేళ మల్కాజిగిరి పార్టీ నేతల్లో అసమ్మతి పెరగకుండా.. కాంగ్రెస్ అధిష్ఠానం చర్యలు చేపట్టింది. రెండు రోజుల క్రితం మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్‌తో హస్తం నేతలు భేటీ అయ్యారు. మైనంపల్లి రాకతో తన టికెట్‌పై సందిగ్ధత నెలకొన్న నేపథ్యంలో.. నేతలు మంతనాలు జరుపుతున్నారు. రాష్ట్ర నేతలు ఎన్ని మంతనాలు జరిపిన మల్కాజిగిరి సీటుపై ఇంకా స్పష్టత లేదని.. ఎట్టి పరిస్థితుల్లో ఈ స్థానం నుంచే పోటీ చేస్తానని నందికంటి శ్రీధర్ మొండిపట్టు పట్టారు.