మున్సిపల్ ఎన్నికల ప్రచార గడువు రేపటితో ముగియనుంది. సోమవారం సాయంత్రం వరకే సమయం ఉండటం వల్ల అభ్యర్థులు ప్రచారంలో తలమునకలై ఉన్నారు. మరోవైపు ప్రధాన పార్టీ అభ్యర్థులకు కొన్ని చోట్ల రెబల్స్ కునుకు లేకుండా చేస్తున్నారు. ప్రత్యర్థుల ఓటమే లక్ష్యంగా బరిలో దిగిన వారు కొందరైతే.. పార్టీ టికెట్లు ఆశించి దక్కకపోవడం వల్ల మరికొందరు పోటీలో నిలిచారు. కొన్ని చోట్ల వీరు పార్టీల అధికారిక అభ్యర్థులకంటే ముందున్నారు. సూర్యాపేటలో నలుగురు తిరుగుబాటు అభ్యర్థుల్ని పార్టీ నుంచి తెరాస సస్పెండ్ చేసింది. రాష్ట్రంలో పలు కార్పొరేషన్లతో పాటు 30కిపైగా పురపాలక సంఘాల్లో రెబల్స్‌తో తెరాస, కాంగ్రెస్, భాజపా అభ్యర్థులు సతమతమవుతున్నారు. కొన్ని పురపాలక సంఘాల్లోని అన్ని స్థానాల్లో సత్తాచాటాలని రెబల్స్ ప్రయత్నిస్తున్నారు. తిరుగుబాటు అభ్యర్థుల్లో ఎక్కువ మంది ఫార్వర్డ్‌బ్లాక్ తరఫున బరిలో దిగగా.. మిగిలిన చోట్ల స్వతంత్రులుగా పోటీలో ఉన్నారు. పార్టీ నుంచి భవిష్యత్తులో ఎలాంటి తోడ్పాటు ఉండదని చెప్పినా వారు ముందుకు సాగుతున్నారు.
ఆఖరి ప్రయత్నాలు విఫలమై:
పార్టీ టికెట్లపై పూర్తి నమ్మకంతో ఉండి చివరి క్షణంలో బీ-ఫారాలు దక్కనివారే ఎక్కువచోట్ల బరిలో నిలిచారు. ఛైర్‌పర్సన్ అభ్యర్థులుగా ఉంటామనుకున్న వాళ్లకు వార్డు మెంబర్‌గా కూడా టికెట్ దక్కకపోనందున సత్తాచాటాలని పోటీలో ఉన్నారు. వర్గాలు, కులాల ఓట్లను నమ్ముకుని కొందరు.. గెలిచిన తర్వాత ఎలాగైనా పార్టీలో ప్రాధాన్యముంటుందని మరికొందరు పోటీ చేస్తున్నారు. ఛైర్‌పర్సన్ అభ్యర్థులుగా రేసులో ఉన్న తమకు పోటీ అవుతారని భావించిన కొందరిపై వ్యూహాత్మకంగా రెబల్స్‌ను బరిలో దింపారు.
- పూర్వ ఖమ్మం జిల్లాలోని ఇల్లెందు, కొత్తగూడెంలలో రెబల్స్ అధికార అభ్యర్థులకు దీటుగా ప్రచారం చేస్తున్నారు. ఇల్లెందులో తెరాస టికెట్లు దక్కని వెంకటేశ్‌గౌడ్ పలు వార్డుల్లో స్వతంత్ర అభ్యర్థులను దింపి ప్రచారంలో ఉన్నారు. కొత్తగూడెంలో అధికారపార్టీలోని రెండు వర్గాలు 14 వార్డుల్లో హోరాహోరీగా తలపడుతున్నాయి.
- నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థులు పలుచోట్ల సత్తాచాటేందుకు ప్రయత్నిస్తున్నారు. నేతల మధ్య వర్గపోరు నేపథ్యంలో పలు చోట్ల పోటీ రసవత్తరంగా మారింది. మిర్యాలగూడ, నల్గొండలో కాంగ్రెసుకు రెబల్స్‌తో తీవ్రమైన సమస్యలు ఎదురవుతున్నాయి. సూర్యాపేట, హుజూర్‌నగర్, కోదాడలో కొన్ని వార్డుల్లో తెరాస రెబల్స్ బరిలో నిలిచారు. సూర్యాపేటలోని 7, 26, 32, 38 వార్డులో పోటీ చేస్తున్న తిరుగుబాటు అభ్యర్థులను తెరాస పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.
- నిజామాబాద్ జిల్లాలో భాజపా టికెట్లు దక్కని పలువురు స్వతంత్రులుగా బరిలో నిలిచారు. నిజామాబాద్, ఆర్మూర్‌లలో భాజపాకు రెబల్స్ ఉన్నారు. నిర్మల్, భైంసా, ఖానాపూర్‌లో పలువురు పార్టీల ఆదేశాలను పట్టించుకోకుండా పోటీలో ఉండటంతో అసలు అభ్యర్థులు చెమటోడ్చాల్సి వస్తోంది.
- వికారాబాద్ జిల్లాలో వికారాబాద్, తాండూరు, కొడంగల్‌లో 18 వార్డుల్లో టికెట్లు దక్కని నాయకులు రెబల్స్‌గా పోటీలో దిగారు.
- ఆదిలాబాద్‌లోని 16 వార్డుల్లో భాజపా తిరుగుబాటు అభ్యర్థులు పోటీలో ఉండగా పది వార్డుల్లో తెరాసకూ ఈ సమస్య ఉంది.
- రామగుండం కార్పొరేషన్‌లో అన్ని పార్టీల నుంచి రెబల్స్ తలపడుతున్నారు. పెద్దపల్లిలో కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థులు పలుచోట్ల బరిలో ఉన్నారు. వేములవాడలో భాజపా, తెరాస టికెట్లు దక్కక పలువురు పోటీలో నిలిచారు.
- దుండిగల్, మీర్‌పేట, తూంకుంట, బండ్లగూడ సహా పలు పట్టణ స్థానిక సంస్థల్లోని కొన్నివార్డుల్లో రెబల్స్ గట్టిపోటీ ఇస్తున్నారు.
ఇక్కడ అన్ని వార్డుల్లో తిరుగుబావుటా
పూర్వ మహబూబ్‌నగర్ జిల్లాలోని కొల్లాపూర్‌లో తెరాస అభ్యర్థులతో పాటు 20 వార్డుల్లోనూ తెరాస తిరుగుబాటు అభ్యర్థులు ఫార్వర్డ్‌బ్లాక్ తరఫున బరిలో దిగారు. ఈ 20 మందికి పార్టీ ముఖ్యనేతల అండదండలు ఉన్నందున అధికార అభ్యర్థులు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. అయిజలోని 20 వార్డుల్లోనూ తెరాస రెబల్స్ పోటీలో ఉన్నారు. అలంపూర్‌లోనూ తిరుగుబాటు అభ్యర్థుల బెడద ఉంది.
ఇదీ చూడండి : టాప్ 10 ప్రధాన వార్తలు