మూడు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల (Heavy Rains) నేపథ్యంలో పురపాలక శాఖ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆ శాఖ మంత్రి కేటీఆర్ (Minister Ktr) అధికారులు ఆదేశించారు. ఈ మేరకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్తో పాటు ఇతర ఉన్నతాధికారులతో మాట్లాడారు. ప్రధానంగా ఉత్తర తెలంగాణలో నెలకొన్న భారీ వర్షాల వల్ల ఇప్పటికే పలు మున్సిపాలిటీల్లో నెలకొన్న పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ను ఆదేశించారు.
నిర్మల్ జిల్లాపై...
ఇప్పటికే నిర్మల్ వంటి చోట్ల భారీగా కురిసిన వర్షాల నేపథ్యంలో జరుగుతున్న సహాయక చర్యలపైన స్థానిక జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. హైదరాబాద్ నగరంలో మరో రెండు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో జీహెచ్ఎంసీ యంత్రాంగం సహాయ చర్యల కోసం సిద్ధంగా ఉండాలని సూచించారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో పనిచేసే డిజాస్టర్ రెస్పాన్స్ దళం సైతం అన్ని విధాలుగా అందుబాటులో ఉండాలన్నారు.
ప్రతి ఉద్యోగి...
ఈ వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టేంత వరకూ ప్రతి ఒక్క పురపాలక శాఖ అధికారి... ఉద్యోగి విధుల్లో ఉంటూ స్థానికంగా అందుబాటులో ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని పురపాలక శాఖ యంత్రాంగానికి మంత్రి కేటీఆర్ సూచించారు. పాత భవనాలు, లోతట్టు ప్రాంతాల్లో ఉన్న పౌరులకు సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అవసరమైతే వారందర్ని సురక్షిత ప్రాంతాలకు వెంటనే తరలించేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని కేటీఆర్ అధికారులను కోరారు.
సిరిసిల్ల జిల్లాపై సమీక్ష...
రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని మంత్రి కేటీఆర్ సూచించారు. జిల్లాలో కురుస్తున్న వర్షాలపై కలెక్టర్ కృష్ణబాస్కర్, ఎస్పీ రాహుల్ హెగ్డేలతో ఫోన్లో మాట్లాడారు. రానున్న మరో రెండుమూడు రోజులు భారీగా వానలు పడే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని, క్షేత్రస్థాయి అధికారులు స్థానికంగా ఉండేలా చూడాలని కేటీఆర్ అన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే పొంగుతున్న వాగుల వద్ద హెచ్చరికలను, వేరే దారులను సూచించే గుర్తులు ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. గ్రామాల్లోనూ పాత ఇళ్లలో ఉన్నవారిని గుర్తించి సురక్షిత ప్రదేశాల్లో ఉంచాలని విజ్ఞప్తి చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రజా ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు.
వర్షాకాలంలో గ్రామాల మధ్య ఉన్న చిన్నచిన్న వాగులను దాటేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎగువ మానేరు జలాశయ నీటిమట్టం పూర్తి స్థాయిలో నిండి మత్తడి పోస్తోందని.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు.
సంబంధిత కథనాలు: