Multilevel Marketing Scams in Hyderabad : మల్టీ లెవల్ మార్కెటింగ్ పేరిట అమాయకుల నుంచి కోట్లు కాజేసిన క్యూనెట్ సంస్థ.. మారుపేర్లతో మోసాలు చేస్తూనే ఉంది. ప్రకాశం జిల్లాకు చెందిన గుమ్మడిల్లి రాజేశ్ అలియాస్ రాజేశ్‌ఖన్నా బెంగళూరులో మకాం పెట్టి మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. మొదట్లో అతను హాంకాంగ్ కేంద్రంగా ప్రారంభించిన క్యూనెట్‌లో పనిచేశాడు. 2017లో ప్రభుత్వం నిషేధించడంతో.. వీ-ఎంపైర్ పేరుతో దక్షిణ భారతదేశంలో కార్యకలాపాలు ప్రారంభించాడు.
Qnet scams in Telangana : ఇందులోభాగంగా స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో కార్యాలయం ప్రారంభించి, రాష్ట్రంలోని నిరుద్యోగులు, అమాయకులను లక్ష్యంగా చేసుకొని మోసాలకు తెరతీశాడు. విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు పొందవచ్చంటూ రాజేశ్ సహా మరికొందరు విస్తృతంగా ప్రచారం చేశారు. నెలకు రూ.20,000 పెట్టుబడి పెడితే.. రూ.80,000, రూ.50,000 పెడితే రూ.1,50,000 వరకు సంపాదన వస్తుందంటూ మాయమాటలతో నిరుద్యోగులను మభ్యపెట్టారు. కొంతకాలం ఆదాయం ఇచ్చి, తర్వాత ముఖం చాటేసేవారు. స్వప్నలోక్ అగ్నిప్రమాదంలో ఆరుగురు మరణించటంతో క్యూనెట్ బాగోతం బయటకొచ్చింది.
ఇ-స్టోర్ ఇండియా పేరిట మోసాలు : పిరమిడ్ విధానంలో రాయితీలు, బోనస్‌లు, బహుమతులను ఎరగా వేస్తూ పలు మల్టీ లెవల్ మార్కెటింగ్ సంస్థలు మోసాలకు పాల్పడుతున్నాయని పోలీసులు హెచ్చరించారు. అలాంటి వాటిలో ఇ-స్టోర్ ఇండియా పేరిట మనీశ్, సయ్యద్ అజ్మల్ మెహదీ మార్కెటింగ్ ఇంఛార్జ్‌లుగా సూపర్‌మార్కెట్ స్కీమ్ పేరిట దేశవ్యాప్తంగా రూ.1,000 కోట్లు వసూలు చేశారు. నగరాలు, పట్టణాల్లో ఒక్కో ఇ-స్టోర్‌కు 25 లక్షలను పెట్టుబడి పేరిట వసూలు చేశారు. రూ.30 లక్షలు పెట్టుబడితో ప్రతినెలా లక్ష లాభం వస్తుందంటూ నమ్మించి, 300 మంది వద్ద డబ్బులు కాజేశారు.
Multilevel Marketing Scams in Telangana : ఈ క్రమంలోనే వారికి కొన్ని నెలలు కమీషన్లు పంపిణీ చేశారు. ఈ పథకంలో సభ్యత్వం పేరుతో ఒక్కొక్కరి వద్ద రూ.8,991 వసూలుచేశారు. సభ్యుల చేత ప్రతినెలా 9,000 ఉత్పత్తులు కొనుగోలు చేయించి, 44 మందిని ఆ ఊబిలోకి దించారు. ఈ వ్యవహారంతో పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వారి బ్యాంకు ఖాతాల్లోని రూ.6.5 కోట్లు సీజ్ చేశారు. మల్టీలెవల్ మార్కెటింగ్ వ్యాపారం పేరిట జరుగుతున్న మోసాలపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
"విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పైన కొన్ని కేసులు నమోదయ్యాయి. ఇందులో సూత్రధారి గుమ్మడిల్లి రాజేశ్. వీ-ఎంపైర్ పేరుతో దక్షిణ భారతదేశంలో కార్యకలాపాలు ప్రారంభించాడు. తమ సంస్థలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని ప్రజలను నమ్మించారు. దీంతో కొందరు నమ్మి పెట్టుబడులు పెట్టారు. ఆ తర్వాత వారికి కొంతం కాలం డబ్బులు చెల్లించారు. అనంతరం వారికి ఇవాల్సిన నగదును ఇవ్వకుండా మోసం చేశారు." - సీవీ ఆనంద్, హైదరాబాద్ సీపీ
ఇవీ చదవండి : వేలల్లో బాధితులు.. రూ.వేల కోట్లలో మోసాలు.. గొలుసుకట్టు ఆట కట్టించలేరా..?