హైదరాబాద్లో కురిసిన కుంభవృష్టితో చిన్న తరహా పరిశ్రమలకు తీవ్ర నష్టం వాటిల్లింది. సామాన్య ప్రజలనే గాక పరిశ్రమల నిర్వాహకులనూ ఇబ్బందులకు గురిచేసింది. లాక్డౌన్తో దాదాపు 4 నెలల పాటు మూతపడిన పరిశ్రమలు.. 2 నెలల నుంచి కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడుతూ కార్మికులకు ఉపాధి కల్పిస్తున్న సమయంలో వరదల తాకిడికి సామగ్రి నాశనం కావడంతో నిర్వాహకులు ఆందోళనలో పడ్డారు.
ఉపాధికి దూరం
సాధారణంగా చిన్న తరహా పరిశ్రమలు ఎక్కువ మందికి ఉపాధికి కల్పిస్తాయి. లాక్డౌన్తో పరిశ్రమలు మూతపడటంతో సొంతూళ్లకు పయనమైన కార్మికులు.. అన్లాక్ అనంతరం పనుల్లో చేరారు. కానీ వరదల కారణంగా పరిశ్రమల్లో ఉత్పత్తి యూనిట్లు, సామగ్రి తడిసిపోవడంతో కార్మికులు ఉపాధి కోల్పోయారు.
రిపేరుకి రూ. లక్షల్లో ఖర్చు
నగరంలో పారిశ్రామిక వాడలుగా పేరుగాంచిన బాలానగర్, కాటేదాన్, మల్లాపూర్, నాచారం, ఆటోనగర్, జీడిమెట్ల ప్రాంతాల్లో వరద తీవ్రత అధికమై పరిశ్రమల్లోకి నీరు చేరింది. మెషినరీ బాగు చేసుకోవాలంటే రూ. లక్షల్లో ఖర్చవుతుందని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
'12 ఏళ్లుగా వ్యాపారం చేస్తున్నా. రూ.50 లక్షల పెట్టుబడితో కెమికల్ గ్లాస్ ట్రేడింగ్ కంపెనీ పెట్టాను. ఆరుగురు ఉద్యోగులున్నారు. 13 వ తేదీ కురిసిన వర్షాలకు పరిశ్రమను వరద ముంచెత్తింది. పది డ్రమ్ముల్లోని రసాయనాలు నీళ్లలో కలిసిపోవడంతో పాటు సామగ్రి తడిసిపోయింది. పన్నులు కట్టేందుకు కూడా డబ్బులు లేవు.'
పెంచలయ్య, కెమికల్ గ్లాస్ ట్రేడింగ్ కంపెనీ నిర్వాహకుడు, మల్లాపూర్
సరకంతా నీళ్లపాలు
జల్ పల్లికి చెందిన ఇమ్రాన్ ఖాన్ అనే వ్యక్తి ఏడాదిన్నర కిందట రూ. 20 లక్షలతో ఫ్యాబ్రికేషన్ పరిశ్రమ పెట్టుకున్నారు. వరదలతో పరిశ్రమ గోడ కూలిపోయి నీరంతా యూనిట్లోకి చేరడంతో సరకంతా నీటిలో నానుతోందని, రూ.5 లక్షల నష్టం వాటిల్లిందని వాపోయారు.
వరదల వల్ల తీవ్రంగా నష్టపోయామని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని ఈ చిరు వ్యాపారవేత్తలు కోరుతున్నారు.
ఇదీ చదవండి: ప్రశాంతమైన పరిసరాల్లో... వేగంగా వైకుంఠధామాల నిర్మాణం