ఇటీవల సంచలనం సృష్టించిన ఓ భూవివాదం కేసులో కోటి పది లక్షల రూపాయల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా ఎమ్మార్వో నాగరాజు పట్టుబడటంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీహెచ్.... ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇదే భూమి విషయంలో ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్న రియాల్టర్ అంజిరెడ్డి వద్ద ఓ ఎంపీకి చెందిన లెటర్ ప్యాడ్‌లు దొరికాయన్నారు . ఆ ఎంపీ ఏ పార్టీకి చెందిన వ్యక్తో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనతో సబ్ కలెక్టర్, కలెక్టర్‌గా పని చేసినా ఏమీ ప్రయోజనం లేదని... అయిదేళ్లు ఎమ్మార్వోగా ఉంటే చాలని కొందరు అధికారులు భావిస్తున్నారని వీహెచ్ పేర్కొన్నారు.
19న నేనే అక్కడికి వెళ్తా...
ఏసీబీ కేసులో వెలుగులోకి వచ్చిన శ్రీనివాస్ రెడ్డి, అంజిరెడ్డిలు ఎవరో తేల్చాలని డిమాండ్ చేశారు. లెటర్ ప్యాడ్‌లు లభించిన ఎంపీ ఎవరో తెలియజేయాలని నిలదీశారు. సీఎం కేసీఆర్ ఆరేళ్ల కాలంలో ఏం చేశారని ప్రశ్నించారు. ఈ నెల 19న రాంపల్లికి, కీసరలకు వెళ్లి క్షేత్ర స్థాయిలో ఏం జరిగిందో తెలుసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని స్పష్టం చేశారు. నాగరాజు వెనుక పెద్ద శక్తులు ఉన్నట్లు అనుమానాలు ఉన్నాయని... వారు ఎవరో బయట పెట్టాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి : ఎడతెరిపిలేని వర్షాలు... మేడారాన్ని చుట్టేసిన వరద నీరు