బొల్లారం జనరల్ హాస్పిటల్‌ను.. ప్రజలకు పూర్తి స్థాయి కొవిడ్ ఆసుపత్రిగా మార్చేందుకు కృషి చేస్తున్నట్లు ఎంపీ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాబోయే 15 రోజుల్లో ఆక్సిజన్‌తో సహా అన్ని వసతులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. కంటోన్మెంట్ సీఈవో, బ్రీ గేడియర్, డీఆర్డీఓ అధికారులతో చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
50 పడకల సామర్థ్యం గల ఆసుపత్రిని 100 పడకలకు పెంచుతున్నట్లు రేవంత్ తెలిపారు. పడకలు లేక అవస్థలు పడుతున్న రోగులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని వివరించారు. ఆసుపత్రి సామగ్రిని తన ఎంపీ నిధుల ద్వారా కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. ఈ విషయంలో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదంటూ.. పేద ప్రజల ప్రాణాలను కాపాడటమే లక్ష్యంగా అందరూ కలిసి రావాలని కోరారు.
ఇదీ చదవండి: ఆక్సిజన్ పేరుతో సీఓ2 సిలిండర్ల విక్రయం