సామాన్యులు రాకపోకలు సాగించే సికింద్రాబాద్ కంటోన్మెంట్ లోని మిలిటరీ రోడ్లపై మూసివేత ఆంక్షలను ప్రజావసరాల దృష్ట్యా ఎత్తివేయాలని ఆర్మీ అధికారులను మాల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి కోరారు. కంటోన్మెంట్ ను సందర్శించిన ఆయన.. రోడ్ల ఆంక్షలపై వివరాలు ఆరాతీసి బోర్డు సీఈవో అజిత్ రెడ్డితో కలిసి బొల్లారంలోని సబ్ ఏరియాకు వెళ్లి.. డిప్యూటీ జీఈవో, బోర్డు అధ్యక్షుడు బ్రిగేడియర్ అభిజిత్ చంద్రను కలిశారు.
రోడ్ల మూసివేతకు సంబంధించిన వివరాలు, పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు. అనేక సంవత్సరాలుగా ఈ రహదారులు గుండా సామాన్యులు రాకపోకలు సాగిస్తున్నారని, ఈ క్రమంలో ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు. కరోనా విజృంభిస్తున్న పరిస్థితుల్లో తాము రోడ్లను తాత్కాలికంగా మూసివేసినట్లు బ్రిగేడియర్ తెలిపారు. వారం రోజుల్లో రోడ్లను తెరిచేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఎంపీ రేవంత్ తెలిపారు.