వారం రోజుల్లోగా బొల్లారం కంటోన్మెంట్ జనరల్ ఆసుపత్రిని పూర్తిస్థాయి కొవిడ్ ఆసుపత్రిగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు మల్కాజిగిరి ఎంపీ రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో కరోనా బాధితులకు కావాల్సిన ఏర్పాట్లను ఆక్సిజన్ ప్లాంట్లు, బెడ్లను, మౌలిక సదుపాయాలను కంటోన్మెంట్ సీఈవో అజిత్ రెడ్డితో కలిసి పరిశీలించారు. పెండింగ్లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వంద పడకల కొవిడ్ ఆసుపత్రిగా కంటోన్మెంట్ జనరల్ ఆస్పత్రిని పేద ప్రజల కోసం అందుబాటులోకి తీసుకువచ్చి మెరుగైన వైద్యం అందించే విధంగా కృషి చేస్తామని అన్నారు.
మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న ప్రముఖ ఫార్మా కంపెనీలు వందల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని... వారు కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద 2 శాతం నిధులను ఖర్చు చేయాలని రేవంత్రెడ్డి అన్నారు. ఫార్మా కంపెనీ యాజమాన్యాలతో మాట్లాడినట్లు వారు కంటోన్మెంట్ ఆస్పత్రికి అన్ని విధాలుగా సహకరించాలని ఆయన కోరారు. బొల్లారంలోని కంటోన్మెంట్ ఆస్పత్రికి తన ఎంపీ నిధుల ద్వారా కోటి రూపాయలు అందించాలని దానికి తోడు అనేక మంది విరాళాల రూపంలో కూడా అందించినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. రాజీవ్ గాంధీ 30వ వర్ధంతి సందర్భంగా ఆయనను స్మరించుకున్నారు. సరళీకృతమైన రాజకీయ విధానాలతో, సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన భారత దేశాన్ని నిర్మించడంలో రాజీవ్ గాంధీ కీలక పాత్ర పోషించారని ఆయన అన్నారు.
- ఇదీ చదవండి : మధ్యాహ్నం 3 గంటల నుంచి వెబ్సైట్లో 'పది' ఫలితాలు