తెలంగాణ రాష్ట్ర ప్రజల జీవితాలు, భవిష్యత్‌కు భరోసా కల్పించాల్సిన పవిత్ర శాసనసభకు... కూతవేటు దూరంలో నాగులు ఆత్మహత్యాయత్నం చేసుకోవడం తనను తీవ్రంగా కలచివేసిందని ఎంపీ రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఆయన ముఖ్యమంత్రికి లేఖ రాశారు.
నాగులు ఆర్తనాదాలలో తెలంగాణ నిరుద్యోగ యువత గుండె చప్పుడు ఉందని ఆయన లేఖలో పేర్కొన్నారు. నాడు యువత శవాల వద్ద కేసీఆర్ కార్చింది కన్నీరా... మొసలి కన్నీరా? అని ప్రశ్నించారు. 1,500 మంది యువత బలిదానాల సాక్షిగా ఆవిర్భవించిన ప్రత్యేక రాష్ట్రంలో... ఇలాంటి దుర్ఘటనలు జరుగుతాయని కలలో కూడా ఊహించలేదన్నారు. కేటీఆర్ సూటు బూటు వేసుకుని బహుళజాతి కంపెనీల ప్రతినిధులతో ఫోటోలు దిగితే ఉద్యోగాలు వచ్చినట్టా అంటూ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు మీడియాలో హెడ్ లైన్స్ వచ్చాయే తప్పా... యువతకు ఉద్యోగాలు మాత్రం రాలేదని ఆరోపించారు.
నాగులుకు మెరుగైన వైద్యం ప్రభుత్వమే అందించాలని, అతనికి ఉపాధి కల్పించేందుకు తగిన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ సమస్యపై ప్రభుత్వం తక్షణ కార్యచరణ ప్రకటించాలని, కేసీఆర్ స్పందించకుంటే... నిరుద్యోగ యువత తరఫున త్వరలో ఉద్యమం చేయనున్నట్లు హెచ్చరించారు.
ఇదీ చూడండి: నాగులుతో ఫోన్లో మాట్లాడిన మంత్రి ఈటల