వ్యవసాయ బిల్లుల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరించిన వైఖరిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. కేంద్రం తెచ్చిన మూడు బిల్లులను 18 పార్టీలు వ్యతిరేకించినా.. కేంద్రం మొండిగా ముందుకెళ్లిందని సీడబ్ల్యూసీ సభ్యుడు, ఎంపీ మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. కేంద్రం తెచ్చిన ఆ బిల్లులు రైతాంగానికి తీవ్ర నష్టం కలిగించేవని ఆందోళన వ్యక్తం చేశారు.
రాజ్యసభలో విపక్షాలన్నీ కలిసికట్టుగా వ్యవసాయ బిల్లులను నిలువరించే ప్రయత్నం చేశామని ఖర్గే వివరించారు. ఆ బిల్లులు వల్ల రైతులకు మద్దతు ధర లభించకపోగా.. కార్పొరేట్ సంస్థలకు మేలు చేసేవిగా ఉన్నాయని విమర్శించారు. వ్యవసాయ నిపుణులు కూడా ఈ చట్టాలు సరైనవి కావని, రైతులు తమ పంటను ఇష్టమైన ధరలకు అమ్ముకునే పరిస్థితి ఉండదని తెలిపారన్నారు.
వాస్తవ పరిస్థితికి వ్యతిరేకంగా అధికార భాజపా అవాస్తవాలను ప్రచారం చేస్తోందని ఖర్గే ఆరోపించారు. మార్కెట్ యార్డులు మూతపడితే రైతులకు మద్దతు ధర ఎలా లభిస్తుందని ఆయన ప్రశ్నించారు. కేంద్రం వెంటనే ఈ బిల్లులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీచూడండి: బాలు మృతిపై ఉపరాష్ట్రపతి తీవ్ర దిగ్భ్రాంతి