Komatireddy venkatreddy Protest at Sri Chaitanya College: భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నార్సింగి శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో బైఠాయించారు. నిన్న ఆత్మహత్య చేసుకున్న ఇంటర్ విద్యార్థి సాత్విక్ ఘటనపై ఆయన ఫైర్ అయ్యారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన కోమటిరెడ్డి.. విద్యార్థి మృతిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
సాత్విక్ ఆత్మహత్య గురించి తెలుసుకునేందుకు కోమటిరెడ్డి... నార్సింగ్‌లోని కళాశాల వద్దకు వెళ్లారు. అప్పటికే కళాశాల వద్ద ఉన్న పోలీసులు ఆయనను అడ్డుకునేందుకు యత్నించారు. పోలీసుల తీరుపై మండిపడ్డ వెంకట్‌రెడ్డి... రాజేంద్రనగర్ డీసీపీ జగదీశ్వర్‌రెడ్డితో ఫోన్లో మాట్లాడారు. విద్యార్థి మృతికి కారణమైన వారిని నిన్న అదుపులోకి తీసుకుని... రాత్రికి రాత్రే ఎలా వదిలేస్తారని ప్రశ్నించారు.
నిందితులను కోర్టులో హాజరుపర్చే వరకు తాను కళాశాల నుంచి వెళ్లేదిలేదని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అక్కడే భీష్మించుకుని కూర్చున్నారు. కళాశాల లోపల నిరాహార దీక్ష చేస్తున్నట్లు ప్రకటించారు. శ్రీ చైతన్య కళాశాల యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేసి... కళాశాల గుర్తింపు రద్దు చేయాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. సాత్విక్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు తమ దీక్ష ఆగదని పేర్కొన్నారు. ర్యాంకుల పేరుతో విద్యార్థులల ప్రాణాలు తీస్తున్నారని మండిపడ్డారు. సాత్విక్ సూసైడ్ నోట్‌లో పేర్కొన్ని నలుగురు బాధ్యుల్ని అరెస్టు చేసే వరకు కదిలేదన్నారు.
పోలీసుల దర్యాప్తు ముమ్మరం : ఇదిలా ఉంటే సాత్విక్ ఆత్మహత్య ఘటనలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కళాశాలకు చెందిన కృష్ణారెడ్డి, ఆచార్య, నరేశ్, శోభన్‌ను నార్సింగి పోలీసులు ప్రశ్నిస్తున్నారు. కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకుల వేధింపుల వల్లే బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు సాత్విక్ రాసిన సూసైడ్ నోట్‌ను నార్సింగి పోలీసులు పలిశీలించారు. దీనిపై స్పష్టత కోసం లేఖను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు పంపించారు. సాత్విక్ చేతిరాతను సూసైడ్ నోట్‌లో ఉన్న రాతను కచ్చితత్వంతో పోల్చేందుకు నిపుణుల అభిప్రాయం సేకరిస్తున్నారు.
ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద ఉద్రిక్తత : ఏబీవీపీ తలపెట్టిన నాంపల్లిలోని ఇంటర్ బోర్డు ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ర్యాలీగా వచ్చి ఇంటర్ బోర్డు కార్యాలయం ఎదుట బైఠాయించడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. ఆందోళన కారులను బలవంతంగా అదుపులోకి తీసుకుని గోషామహల్ స్టేడియానికి తరలించారు. ఆందోళన కారులను అడ్డుకునే క్రమంలో తీవ్ర వాగ్వివాదం, తోపులాట జరగడం కాసేపు ఉద్రిక్తతకు దారితీసింది. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైన కాలేజీలను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కళాశాలల యాజమాన్యంపై చర్యలు తీసుకొని... సాత్విక్ కుటుంబానికి న్యాయం చేసేంత వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు.
కళాశాలల ఆగడాలకు విద్యాకుసమాలు బలైపోతున్నారు: ఆమ్ ఆద్మీ పార్టీ నాంపల్లి ఇంటర్ బోర్డు ఎదుట ఆందోళన చేపట్టింది. నార్సింగి శ్రీ చైతన్య కళాశాల యాజమాన్యం ఒత్తిడి వల్లే ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి సాత్విక్ మృతిపై...సమగ్ర విచారణ జరిపించాలని ఆప్ నేతలు డిమాండ్ చేశారు. కార్పొరేట్ కళాశాలల ఆగడాలకు విద్యాకుసుమాలు బలైపోతున్నారని ఆరోపించారు. కళాశాల గుర్తింపు రద్దు చేసి... సాత్విక్ కుటుంబానికి న్యాయం చేయాలని నినాదాలు చేశారు. కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించిన ఆందోళనకారులను అడ్డుకున్న పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇవీ చదవండి: