తెలంగాణ కాంగ్రెస్ నూతన పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై పార్టీ అధిష్ఠానం కసరత్తు మొదలు పెట్టింది. డజను మందికిపైగా పోటీ పడుతున్నా... ముగ్గురు నలుగురి మధ్యనే ఎక్కువ పోటీ ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ నలుగురిలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డిలున్నారు. వీరిద్దరు కూడా ఎవరి స్థాయిలో వారు ఏఐసీసీలో లాబీయింగ్ చేసుకుంటున్నట్లు సమాచారం.
దిల్లీలో గళమెత్తుతున్నారు
మరో వైపు ఈ ఇద్దరు ఎంపీలు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తూ అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టే పనిని చేపట్టారు. పీసీసీ నేతృత్వంలో జరగాల్సిన కార్యక్రమాలను వీరిద్దరు వ్యక్తిగత హోదాలో నిర్వహిస్తూ దూకుడుగా ముందుకెళ్లుతున్నారు. ఇటు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ స్థానిక సమస్యలపై పోరాటం చేస్తూనే, అటు దిల్లీలో రాష్ట్ర సమస్యలపై గళమెత్తుతున్నారు.
కేంద్ర నేతలను కలిసిన కోమటిరెడ్డి
లోక్సభ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భువనగిరి నియోజకవర్గ పరిధి సమస్యలపై ప్రధాని, కేంద్ర మంత్రులకు లేఖలు రాయడమే గాక, ప్రత్యేకంగా సంబంధిత మంత్రులను కలుస్తున్నారు. వినతి పత్రాలనందించి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా మేడిపల్లిలో ఫార్మాసిటీ అనుమతులను రద్దు చేయాలని కోరడమే కాకుండా ఫార్మా సిటీలో భారీ కుంభకోణం దాగి ఉందని, పేద ప్రజల భూమిని బలవంతంగా లాక్కుని స్థిరాస్థి వ్యాపారం చేస్తున్నారని కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. మూసీనది ప్రక్షాళనపై ఏకంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడిని కలిసి ఆయన ద్వారా కేంద్ర జల వనరుల శాఖ మంత్రిపై ఒత్తిడి తెచ్చారు.
రేవంత్రెడ్డి పట్నం గోస
మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి పట్నం గోస పేరుతో నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. పట్టణ ప్రగతి పేరుతో తెలంగాణ సర్కార్ కార్యక్రమాలు చేపడుతుండగా దానికి వ్యతిరేకంగా పట్నం గోస పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తూ క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. అధికారపార్టీ నాయకుల చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై దృష్టిసారించి ఆధారాలతో సహా కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తున్నారు.
ఎవరికి దక్కెనో
పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టి సారించిన సమయంలో ఎంపీలు పోటీ పడి నియోజకవర్గాల అభివృద్ధికి పాటు పడుతుండటం పట్ల పార్టీ వర్గాల్లో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతగా హడావుడి చేస్తున్న ఈ ఇద్దరిలో ఒకరికి అధ్యక్ష పదవి వరిస్తుందా… లేక ఇతరులకు దక్కుతుందా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.
- ఇదీ చూడండి : 'మేడారం జాతరలో ఆర్టీసీ పాత్ర ఎంతో కీలకం'