తెలంగాణ రాష్ట్రంలో ఐకేపీ సెంటర్ల వద్ద నెల రోజులుగా పడిగాపులు కాస్తున్న రైతుల ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని పార్టీ సమస్యలను పక్కకు పెట్టి ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని అన్నారు. నెల రోజులుగా రాష్ట్రంలో ఐకేపీ సెంటర్ల వద్ద ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు చేయాల్సిన పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ హుజురాబాద్‌లో ప్రజాప్రతినిధులను కొనే పనిలో బిజీగా ఉన్నారని ఆరోపించారు.
నెల రోజులుగా ధాన్యం ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ.. కొట్టుకుపోతున్నా ప్రభుత్వ పెద్దలు పట్టించుకోకపోవడం బాధాకరమని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. తేమ ఉందని, తాలు శాతం ఎక్కువ ఉందని సాకులు చెప్తూ... కావాలనే రైస్ మిల్లర్లు ధాన్యం కొనట్లేదని విమర్శించారు. ఇప్పటికీ 70 శాతం మంది రైతులు ధాన్యం తీసుకొచ్చి రోడ్ల మీదనే పడిగాపులు కాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి తిండి పెడుతున్న రైతన్న నోట్లో మట్టి కొట్టే విధంగా తెరాస ప్రభుత్వం వ్యవహరిస్తే చూస్తూ ఉరుకోమని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హెచ్చరించారు.
ఇదీ చదవండి; రెండో విడతలోనూ గర్భిణులపై కొవిడ్ తీవ్ర ప్రభావం