ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న అరాచక, ఆందోళన పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం జోక్యం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వ అణచివేత, వేధింపు చర్యల నుంచి ప్రజలను రక్షించాలని తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ కోరారు. గురువారం రాజ్యసభలో సాధారణ బడ్జెట్‌పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ విభజన చట్టంలో చెప్పిన హామీల ప్రకారం ఆ రాష్ట్రానికి నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. విశాఖపట్నం రైల్వే జోన్ పరిధిని ప్రకటించలేదని, ఆర్థికలోటు నుంచి ఉపశమనం కల్పించలేదని పేర్కొన్నారు.
విశాఖ ఉక్కుపై రాష్ట్ర ప్రభుత్వం మొసలికన్నీరు
‘విశాఖ ఉక్కులో కొత్త ప్లాంట్ ఏర్పాటు కోసం పోస్కో ప్రతినిధులు ఏపీ ముఖ్యమంత్రిని కలిసినా దానిని దాచిపెట్టారు. ప్రైవేటీకరణ ప్రక్రియను చాలా ముందుగా మొదలుపెట్టిన ఏపీ ప్రభుత్వం.. తాజా ప్రతిపాదనలపై మొసలికన్నీరు కారుస్తోంది. కేంద్రం ఈ ప్రక్రియను ఉపసంహరించుకోవాలి. ముఖ్యమంత్రి దిల్లీ పర్యటనలు రాష్ట్ర సమస్యల కోసమా? లేదంటే అందరికీ తెలిసిన ఇతరత్రా కారణాల కోసమా? 2019 జూన్ తర్వాత ఏపీలో 140 ఆలయాలపై జరిగిన దాడులపై సీబీఐ దర్యాప్తు జరిపించాలి...’ అని కనకమేడల కోరారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి రైతులు 422 రోజులుగా ఆందోళన చేస్తున్నారని’ వివరించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.55,548 కోట్లు అవుతుందని అంచనా వేసినా నిధులు రాబట్టుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోలేదని కనకమేడల విమర్శించారు.