లాక్‌డౌన్ వేళ.. మరింత కనిపెట్టుకుని ఉంటోంది అమ్మ. పిల్లలు బయటకు వెళ్లకుండా.. ఇంటిపట్టునే ఉండేలా తను ఎన్నో శ్రమలకోరుస్తోంది. కష్టాలన్నీ చిరునవ్వుతో దాటేస్తూ.. పిల్లలు కోరినవన్నీ చేసి పెడుతూ.. ఇల్లే పదిలం అనేలా చేస్తోంది.
దాదాపు యాభై రోజులుగా ఇంటి నిండా జనాలు. అమ్మకు చేతినిండా పని. ఇంటాయన బాల్కనీలో నుంచి కాఫీ అంటాడు. టీవీ ముందున్న కొడుకు బూస్ట్ కోరతాడు. కాసేపయ్యాక ‘ఏంటి స్పెషల్స్’ అంటూ పిల్లాజెల్లా డైనింగ్ టేబుల్ దగ్గరికి చేరుకుంటారు.
అప్పటికే అక్కడ పొగలు కక్కుతూ పదార్థాలు సిద్ధంగా ఉంటాయి. అల్పాహారం తర్వాత ల్యాప్‌టాప్ చూస్తూ పెద్దోడు.. ఫోన్‌తో చిన్నకూతురు..! ఒత్తులు చుడుతూ పెద్దావిడ.. పుస్తకాలు చూస్తూ పెద్దాయన..! అందరూ ఎవరి పనుల్లో వాళ్లుంటారు. తామున్న చోటు అనువుగా అనిపించని మరుక్షణం.. మకాం మరోగదికి మార్చేస్తారు. చేస్తున్న పని మీద విసుగొస్తే.. చిటికెలో మరోపనికి మారిపోతారు.
ఇలాంటి వెసులుబాటు అమ్మకు ఉండదు. ఎలాంటి ప్రతికూలతలూ ఉడకనివ్వదామె! దేనికీ లొంగదు. అమ్మ అలా ఉండబట్టే.. లాక్‌డౌన్ విజయవంతం అయ్యిందేమో!
అన్నీ చిరునవ్వుతోనే..
లాక్‌డౌన్‌లో వంటనూనె వాడకం జాస్తీగా పెరిగిందన్న కథనం చాలు.. అమ్మ మీద పనిభారం ఎంత పడిందో చెప్పడానికి! సాధారణ రోజుల్లోనే వంటింట్లో నిత్యం అష్టావధానం చేస్తుంటుంది. ఇప్పుడు అదికాస్తా మహా సహస్రావధానం స్థాయికి చేరుకుంది. రాత్రి పడుకునే ముందే.. ‘రేపు వడలు చెయ్యమ్మా!’ కూతురు కోరిక. ‘మధ్యాహ్నానికి చింతచిగురు పప్పు చెయ్యవా అమ్మ. వడియాలు నంజుకొని తింటే భలేగా ఉంటుంది’ కొడుకు అభ్యర్థన.
అన్నిటికీ అమ్మ సమాధానం చిరునవ్వే! పతిదేవుడి ఆజ్ఞలు అదనం. మర్నాడు మమకారం దండిగా వేసి, ప్రేమను రంగరించి.. పిల్లల కోరికలన్నీ వండి వార్చి సిద్ధం చేస్తుంది అమ్మ. మధ్యాహ్న భోజనం చేస్తూనే.. సాయంత్రం అల్పాహారం సంగతి కనిపెడుతుంది. రాత్రి భోజనంలోకి ఏం చేయాలో వాకబు చేస్తుంది. వంటపనులు చేస్తూనే.. ఇంటిపనులు చక్కదిద్దుతుంటుంది. అమ్మ నేర్పుగా నెట్టుకురాబట్టే.. బయట కన్నా.. ఇల్లు పదిలమైంది.
రావొద్దమ్మా..
అమ్మ మహానటి! ఎంత అలసినా.. ఆ కష్టం కళ్లల్లో కనిపించనివ్వదు. అమ్మ జగమొండి! కూతురో, కొడుకో, కోడలో సాయం చేస్తామన్నా.. ‘మీకెందుకు శ్రమ’ అంటూ అన్నీ తానే చేసేస్తుంది! రాకరాక ఇన్ని సెలవులు వచ్చాయి. ఇంటిపట్టున ఉండే అవకాశం దొరికింది. ఈ సమయంలోనే మాతృదినోత్సవమూ కలిసొచ్చింది.
ఈ రోజు అమ్మకు లాక్‌డౌన్ అమలు చేయండి. అమ్మను వంటింట్లోకి రాకూడదని అభ్యర్థించండి. ఉదయం 6 నుంచి సాయంత్రం 7 వరకు లాక్‌డౌన్ ఆంక్షలు ఉంటాయని ప్రేమగా హెచ్చరించండి. ఉప్పూ పప్పూ ఎక్కడున్నాయో చెప్పడానికి మాత్రం ఒకసారి రావొచ్చని వెసులుబాటు ఇవ్వండి. రాత్రి 7 గంటల తర్వాత కర్ఫ్యూ పెట్టండి. అంటే ఏడు తర్వాత వంటింటి ముఖమే చూడొద్దన్నమాట! అన్ని పనులూ మీరే చేయండి.
దీన్ని పక్కాగా చేసి చూడండి.. అమ్మ కళ్లు చెమ్మగిల్లుతాయి. అవి ఆనందభాష్పాలే అని వేరే చెప్పాలా! లాక్‌డౌన్‌ను విజయవంతం చేసిన అమ్మకు ఇంతకన్నా గొప్ప బహుమతి ఇంకేమివ్వగలం! ఇదే లాక్‌డౌన్ నెలకోసారైనా ఇంట్లో అమలు చేసే ప్రయత్నం చేయండి. దైర్యంగా ఉండండి. అమ్మ ఒప్పుకొంటే కదా!!
ఇదీచూడండి: "నా బిడ్డను నాకు తెచ్చివ్వండి !?" డీజీపీని నిలదీసిన మహిళ