ఆంధ్రప్రదేశ్ నెల్లూరు నగరంలోని జెండా వీధిలో ఉన్న షేక్ అఫ్రిన్ ఇంటికి వెళ్లగానే.. ఓ బాధ.. గుండెల్ని పిండేస్తుంది. మానసిక సమస్యతో బాధపడుతున్న కొడుకును కంటి పాపలా కాపాడుకుంటూ.. సాయం కోసం ఎదురుచూస్తున్న కళ్లు ఆ ఇంట్లో దర్శనమిస్తాయి. షేక్ అఫ్రిన్‌కు 15 ఏళ్ల క్రితం వివాహమైంది. పెళ్లైన ఏడాదికే అఫ్రిన్‌కు ముజామిల్ పుట్టాడు. ఆ సంతోషం ఆమెకు ఎంతోసేపు నిలవలేదు. పుట్టుకతోనే బుద్ధిమాంధ్యం. చిన్న మెదడులో సమస్యతో వయసుపైబడుతున్నా.. మానసికంగా ఎదుగుదల లేదు. శరీరం చచ్చుబడి పోయి.. కనీసం నిలబడలేని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో అండగా ఉండాల్సిన అఫ్రిన్ భర్త... ఇళ్లు వదిలి వెళ్లిపోయాడు. మరో వివాహం చేసుకుని.. దూరమయ్యాడు. నా అన్న వారు ఉన్నా లేనట్లే. అంతా.. దూరం కావడం వల్ల ఆ తల్లికి కష్టాలు మొదలయ్యాయి.
అందరి పిల్లల్లాగా తన బిడ్డ కూడా చలాకీగా ఉంటే చూడాలని అఫ్రిన్ ఆశ. మసీదుల వద్ద చిన్నచిన్న పనులు చేస్తూ బతుకీడుస్తుంది. అఫ్రిన్ సమస్య తెలుసుకున్న మసీదు నిర్వాహకులు.. పోషణ కోసం ఎంతో కొంత డబ్బులు ఇస్తున్నారు. వాటితో జీవనం కొనసాగించటం సహా దివ్యాంగుడిగా ఉన్న కొడుకు ఆలనాపాలనా చూసుకుంటోంది. ఇటు పూట గడవక.. అటు కుమారుడికి సరైన వైద్యం చేయించలేక.. నరకయాతన అనుభవిస్తోంది. లాక్‌డౌన్ విధింపుతో అఫ్రిన్ కష్టాలు మరింత ఎక్కువయ్యాయి.
బంధువులు దూరమైనా.. కనీసం పలకరించే వారు లేక.. అఫ్రిన్.. మరింత ఆవేదనకు గురవుతోంది. ఒక్కోసారి చనిపోవాలని అనిపించినా.. తాను కూడా దూరమైతే.. కుమారుడి పరిస్థితి ఏంటని ఆలోచించి బతుకుతున్నానని ఉబికి వస్తున్న కన్నీటిని తూడుచుకుంటూ చెబుతోంది. వీరి కష్టాల కడలిని తెలుసుకున్న ఓ స్వచ్ఛంద సంస్థ.. మూడు నెలలకు సరిపడా నిత్యావసరాలు అందించింది.
దివ్యాంగుడైన కుమారుడికి నెలవారీ పింఛన్ కోసం చాలా సార్లూ ప్రయత్నించినా ఎవరూ కనికరించలేదు. ఇప్పటికైనా తన దుస్థితి చూసి ఆదుకోవాలని...ఆ తల్లి వేడుకుంటోంది.
ఇదీ చదవండి: సింగరేణిలో ఘోర ప్రమాదం.. నలుగురు మృతి